Last Updated:

Janasena Party: తెలంగాణలోనూ అదే ‘గుర్తు’.. అసెంబ్లీ నాటికి గేమ్ ఛేంజర్‌గా మారే ఛాన్స్

Janasena Party: తెలంగాణలోనూ అదే ‘గుర్తు’.. అసెంబ్లీ నాటికి గేమ్ ఛేంజర్‌గా మారే ఛాన్స్

Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన వారికి మాత్రమే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తారు.

తెలుగు నేలపై.. ఒకే గుర్తు
గత నెలలోనే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ కూడా చేరింది.. నిబంధనల ప్రకారం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ కూడా అందింది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయంతో ఈసీ ఏపీలో ఆ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏపీలో తమను గుర్తింపు పొందిన రాజకీయ పక్షంగా గుర్తించినట్లుగా.. తెలంగాణలోనూ గుర్తించి, గాజుగ్లాసు తమకు కేటాయించాలని ఇటీవల జనసేన లీగల్‌ సెల్‌ చైర్మన్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు అనుమతిస్తూ ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.

జనసైనికుల్లో జోష్
మరోవైపు, తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థలు జరగనున్నందున ఈసారి తప్పనిసరిగా బరిలో నిలిచి సత్తా చాటాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. దీనివల్ల పార్టీ నిర్మాణం మరింత బలపడుతుందని, ఇంకా పార్టీ అడుగుపెట్టని ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు ఇదో ఇదో మంచి అవకాశమని జనసేన నియోజకవర్గాల నేతలూ భావిస్తున్నారు. ఇక.. పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే పంచాయతీలు మినహా మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో నిలిచి ప్రజల ముందుకు వెళితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలోనూ నిరాకరించలేని.. ప్రత్యామ్నాయ కీలక రాజకీయ శక్తిగా జనసేన నిలుస్తుందని క్షేత్రస్థాయిలోని జనసైనికులు బలంగా విశ్వసిస్తున్నారు.

బల్దియా టు అసెంబ్లీ
సీమాంధ్ర ఓటర్లతో బాటు భారీగా మెగా ఫ్యామిలీ అభిమానులున్న హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ బరిలోకి దిగితే.. బల్దియాలో రాజకీయ సమీకరణాలే మారతాయనే ఆలోచనను ఈ సందర్భంగా జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడటం, కాంగ్రెస్ పార్టీకి నగరంలో పెద్దగా పట్టులేకపోవటంతో బీజేపీ- జనసేన కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుందనే మాట జనసైనికుల నుంచి వినిపిస్తోంది. దీనికి తోడు.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 10 రోజుల వ్యవధిలోనే అభ్యర్థులను ప్రకటించి బరిలో నిలిచిన బీజేపీ బీఆర్‌ఎస్‌కు దగ్గరగా నిలిచి నగరంలో తనకున్న బలాన్ని చాటుకుంది. ఇప్పటికే జనసేన ఎన్డీయే భాగస్వామిగా ఉన్నందున.. ఇప్పటి నుంచే జనంలో ఉంటే.. వచ్చే అసెంబ్లీ నాటికి ఈ కూటమి సత్తా చాటగలుగుతుందని అటు బీజేపీ కార్యకర్తలూ భావిస్తున్నారు.

ఎప్పుడూ త్యాగాలేనా?
పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో జనసేన పార్టీ కార్యకర్తలకు పెద్దగా అవకాశాలు కల్పించలేదు. 2014 ఎన్నికల్ల బేషరతుగా ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన జనసేన.. తర్వాతి ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలిచింది. అయితే, ఇకపై.. పార్టీ క్యాడర్‌కు ఎన్నికల బరిలో దిగే అవకాశం కల్పించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయమూ జరగటంతో తెలంగాణలోనూ ఇక జనసేన హవా సాగనుందని జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మీ పనితీరు బాగుంది: పవన్
ఎర్రచందనం శేషాచల పర్వత సానువుల్లో మాత్రమే లభించే ఒక అరుదైన జాతి వృక్షమని, దాని పరిరక్షణ చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎర్రచందనం సంరక్షణపై కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న అధికారులను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. 195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ఏపీ అటవీ శాఖ, రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో 8 మంది నేరస్తులను పట్టుకున్నారని అధికారులను ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌తో ఎంతో విలువైన సహజ సంపదను అధికారులు రక్షించారని, ఇది విధినిర్వహణ పట్ల వారి తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. వన్యప్రాణులు, అటవీ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు.. భవిష్యత్ తరాల వారికి మన అడవుల విశిష్టతను తెలియజేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: