MLC Elections: నేడే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్
Announces MLC Elections for Telangana, Andhra Pradesh: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు మార్చి 29వ తేదీన ఖాళీ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఇక, తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు, విజయనగరం-విశాఖపట్నంలకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు భర్తీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, ఈనెల 10 వరకు కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరీంనగర్‌లోనే నామినేషన్ల సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన శాసన మండలి ఎన్నికల పోలింగ్ ఉండగా.. మార్చి 3వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై.అశోక్ కుమార్ బరిలో నిల్చున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఆయన 2024లో పదవీ విరమణ పొందారు. దీంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరునే టీపీటీఎఫ్ మళ్లీ ఖరారు చేసింది.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు సైతం అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జల్లాకు చెందిన మాల్క కొమరయ్య పేర్లను ఖరారు చేసింది. ఇక, కాంగ్రెస్ నుంచి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.