Telugu States New Judges: తెలుగు హైకోర్టులకు కొత్త జడ్డీలు.. ఉత్తర్వులు జారీ చేసిన భారత రాష్ట్రపతి
New Judges appointed to The Telugu High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అందులోభాగంగా తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
జాబితా ఇదే..
తాజా ఉత్తర్వుల ప్రకారం.. జస్టిస్ రేణుక, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్ మధుసూధన్ రావులు తెలంగాణ హైకోర్టులో రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించనున్నారు. అదే సమయంలో జస్టిస్ తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నలుగురు కొత్త న్యాయమూర్తులు శుక్రవారం నుంచి బాధ్యతలు స్వీకరించవచ్చని సమాచారం. మరోవైపు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావులను నియమించింది.
ఇంకా 7 స్థానాలు..
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమైంది. నియామకం కోసం పలువురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్స్ చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, 28 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా, ఇద్దరిని నియమించినా, ఇంకా ఏడు సీట్లు ఖాళీగానే ఉంటాయి. ఇటు తెలంగాణలోనూ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగానే ఉంది.