Michelle Obama : విడాకుల రూమర్స్‌పై తొలిసారిగా స్పందించిన మిషెల్ ఒబామా

Michelle Obama : అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా వదంతులు వస్తున్నాయి. విడాకులపై ఒబామా భార్య మిషెల్ తాజాగా స్పందించారు. విడాకుల వార్తలను ఆమె కొట్టిపారేశారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పాడ్‌కాస్ట్‌లో హీరోయిన్ సోఫియా బుష్‌తో మిచెల్ ఒబామా సంభాషించారు. ప్రస్తుతం తాను వ్యక్తిగత విషయాలు, జీవితంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. తన గురించి ఆలోచించే సమయం ఇప్పుడు దొరికిందని, అందుకే అధికారిక, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
నా జీవితంలో ఎన్నో మార్పులు..
8 ఏళ్లలో తన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పుకొచ్చారు. కూతుళ్లు పెద్దొళ్లు అయ్యారని, తన గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా తనకు సమయం దొరికిందని తెలిపారు. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదని చెప్పుకొచ్చారు. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటోందని ఎవరూ గ్రహించడంలేదని స్పష్టం చేశారు. కేవలం భర్త నుంచి విడిపోతోందని చర్చించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను మాత్రం తనకు ఏది మంచో అదే చేస్తానని చెప్పారు. ఇతరులు ఏమనుకుంటున్నారో అది తాను చేయనని మిషెల్ చెప్పుకొచ్చారు.
వైవాహిక బంధంలో ఒడిదిడుకులు..
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన వైవాహిక బంధంలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొన్నట్లు ఒబామా తెలిపారు. ప్రస్తుతం తన భార్య మిషెల్ ఒబామాతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. హామిల్టన్ కళాశాల ప్రెసిడెంట్ స్టీవెన్ టెప్పర్‌తో జరిగిన చర్చలో బరాక్ ఒబామా ఈ విషయాన్ని వెల్లడించారు. రెండుసార్లు అమెరికా అధ్యక్ష హోదాలో ఉండడం వల్లే తన భార్య ఒబామాతో రిలేషన్ దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. భార్య మిషెల్‌తో బంధంలో తీవ్ర లోటు ఏర్పడినట్లు చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏర్పడిన అగాధం ఇప్పుడు చిన్న చిన్న సరదాలతో తీర్చుకుంటున్నట్లు తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన భార్యతో రిలేషన్ ఇంప్రూవ్ అయినట్లు బరాక్ ఒబామా వెల్లడించారు.
కొంత కాలంగా జోరుగా ప్రచారం..
ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫ్రెండ్స్ స్టార్ జ్నెనిఫర్ అనిస్టన్‌తో ఒబామా డేటింగ్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే భార్య మిషెల్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయంటూ అమెరికా మీడియాలో కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు వస్తున్నాయి. అధికారిక కార్యక్రమాలకు బరాక్ ఒక్కరే హాజరుకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఒబామా, మిచెల్ దంపతులు 1992లో వివాహం చేసుకున్నారు. వీరికి సాషా, మలియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.