Turkey-Pakistan : పాక్ ప్రధాని విలువైన మిత్రుడు : అభివర్ణించిన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్

Turkey-Pakistan : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి వస్తువుల దిగుమతి నిలిపివేయాలని ‘బాయ్‌కాచ్ తుర్కియే’ నినాదంతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో తుర్కియేకు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఎర్డోగాన్ అభినందించారు. పాక్ తమ నిజమైన విత్ర దేశమన్నారు. గతంలో మాదిరిగా భవిష్యత్‌లో అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానిని విలువైన మిత్రుడిగా ఎర్డోగాన్ అభివర్ణించారు.
తుర్కియే-పాక్ దేశాల మధ్య సోదరభావం..
తన విలువైన మిత్రుడు షహబాజ్ షరీఫ్.. తుర్కియే-పాక్ దేశాల మధ్య సోదరభావం అనేది నిజమైన స్నేహానికి నిదర్శనమన్నారు. ప్రపంచంలో కొన్నిదేశాలు మాత్రమే దీని కొనసాగిస్తాయన్నారు. తుర్కియేలో మాదిరిగానే పాక్‌లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. వివాదాల పరిష్కారంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ విధానాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. గతంలో మంచి, చెడు సమయాల్లో మాదిరిగా భవిష్యత్తులో పాకిస్థాన్‌కు అండగా ఉంటానని చెప్పారు. పాకిస్థాన్-తుర్కియే దోస్తీ జిందాబాద్ అంటూ ఎర్డోగాన్ పేర్కొన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారత్..
పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. దీనికి ప్రతిస్పందనగా పాక్ భారత్‌పై డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో దాయాదికి పూర్తి మద్దతు తెలిపిన తుర్కియే.. డ్రోన్లతో సహా యుద్ధనౌకను పంపించినట్లు తెలిపింది. వీటితోపాటు సైనిక సాయం కూడా చేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌కు సాయం చేస్తున్న తుర్కియేపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియేకు బుకింగ్‌లను నిలిపివేసింది. అక్కడి యాపిల్‌ల దిగుమతిని నిరాకరిస్తూ పుణె వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు.