Veg vs Non veg: వెజ్ లేదా నాన్ వెజ్, ఆరోగ్యానికి ఏది తింటే.. ఎక్కువ ప్రయోజనాలు ?

Veg vs Non veg: మనం తినే ఆహారం శరీరాన్ని పోషించడమే కాకుండా, మనకు ఆరోగ్యం, శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆహారం గురించి మాట్లాడితే.. ప్రపంచంలో అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. అందులో కొంతమంది శాఖాహారాన్ని ఇష్టపడితే.. మరి కొందరు మాంసాహారం తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ రెండూ శరీర బలాన్ని పెంచడానికి , ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి.
ఇదిలా ఉంటే చాలా మంది సెలబ్రిటీలు మాంసాహారం తినడం పూర్తిగా మానేసి శాఖాహారం తింటూన్నామని చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. అసలు శాఖాహారం, మాంసాహారం రెండింట్లో ఏది మంచిది , ప్రయోజనకరమైనది? వెజ్ , నాన్-వెజ్ ఫుడ్ యొక్క ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
వెజ్ vs నాన్ వెజ్‌లలో ఏది మంచిది?
శాఖాహారం వల్ల కలిగే ప్రయోజనాలు:
శాఖాహారం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెజ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. శాఖాహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంతో పాటు క్యాన్సర్ . మధుమేహ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
గుండె ఆరోగ్యానికి మంచిది:
శాఖాహారంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా రోగ నిరోదక శక్తిని పెంచుతాయి.
బరువు నియంత్రణ:
ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు , తృణధాన్యాలు అధికంగా ఉండే శాఖాహార ఆహారం బరువు తగ్గడానికి లేదా నియంత్రించడానికి సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరం:
ఫైబర్ అధికంగా ఉండే శాకాహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
క్యాన్సర్, డయాబెటిస్ ప్రమాదం:
శాకాహారులు టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్లతో బాధపడే అవకాశం తక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
మాంసాహారం వల్ల కలిగే ప్రయోజనాలు:
శాఖాహారం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మాంసాహారం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మాంసాహారం తినడం వల్ల ప్రోటీన్ అవసరం తీరుతుంది. విటమిన్లు, ఖనిజాల లోపాన్ని తొలగిస్తుంది. అంతే కాకుండా కండరాల వేగవంతమైన అభివృద్ధికి సహాయపడుతుంది.
ప్రోటీన్ పుష్కలం:
గుడ్డు, కోడి మాంసం, చేపలు, మాంసం వంటి ఆహారాలు శరీరానికి కండరాలకు అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను అందిస్తాయి.
విటమిన్లు, ఖనిజాలు:
మాంసం, గుడ్లు, చేపలలో విటమిన్ బి12, ఐరన్ , జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కండరాల పెరుగుదల:
ఫిట్‌నెస్ , బాడీబిల్డింగ్‌లో పాల్గొనే వారికి మాంసాహారం ప్రయోజనకరంగా ఉంటుంది.
వెజ్ vs నాన్ వెజ్ ఏది మంచిది?
ఆహారంలో పప్పుధాన్యాలు, సోయా, పనీర్ వంటి ప్రోటీన్ వనరులు లేకపోతే.. అది శరీరంలో బలహీనతకు లేదా కండరాల లోపానికి దారితీస్తుంది. దీనితో పాటు విటమిన్ B12,ఐరన్ వంటి పోషకాలు ప్రధానంగా మాంసాహారంలో ఉంటాయి. వీటిని శాఖాహార ఆహారంలో తీర్చడం కొంచెం కష్టం.
మాంసాహారం వల్ల కలిగే హాని:
మాంసం అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. అలాగే.. మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం , అసిడిటీ వస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు హానికరం కావచ్చు. మాంసాహారం తీసుకోవడం సమతుల్యంగా లేకపోతే అది ఊబకాయాన్ని పెంచుతుంది.
శాఖాహారం ఆహారం దీర్ఘాయువు, మెరుగైన గుండె ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది. మీరు ఫిట్‌నెస్, కండరాల పెరుగుదల లేదా శక్తి కోసం ఆహారం ప్లాన్ చేస్తుంటే.. మాంసం మితంగా తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే.. ఆరోగ్యకరమైన గుండె, మెరుగైన జీర్ణక్రియ ,దీర్ఘాయువు కోరుకుంటే.. సమతుల్య శాఖాహారం ఆహారం మీకు మంచి ఎంపిక. రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి కానీ కొన్ని అధ్యయనాలలో, శాఖాహారం.. మాంసాహారం కంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పబడింది.