Supreme court: ఈడీ విచారణపై సుప్రీంలో కవిత పిటిషన్.. స్టే నిరాకరణ
ఒక మహిళను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
Supreme court: ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ విచారణపై అభ్యంతరం
తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ, విచారణ అలా జరుగలేదని కవిత( (MLC Kavitha) పేర్కొన్నారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ మొబైల్ ఫోన్లు సీజ్చేశారని కవిత సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉందని.. కానీ, ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్ను విచారణకు తీసుకుంటున్నట్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది.
మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ(Supreme court)
మరోవైపు ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరుకావడంపై సుప్రీం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోసారి ఈడీ ముందుకు(Supreme court)
అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 16 న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కవిత రేపు మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
ఆమె తొలిసారి మార్చి 11న ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు 9 గంటలపాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మరో సారి విచారణ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
లిక్కర్ స్కామ్ కేసులో తదుపరి అరెస్టు కవితదే అనే ఊహాగానాల నేపత్యంలో రేపు విచారణలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్ గా మారింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సమావేశం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం ఉదయం ఢిల్లీ బయలు దేరారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.
మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో కేంద్రం పెట్టాలని డిమాండ్ పై ప్రతిపక్షాలతో కలిసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు బీఆర్లఎస్ వర్గాలు చెబుతున్నారు.