Hyderabad: తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు
తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై జాతీయ నేర గణాంక సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో. తెలంగాణలో క్రైం రేటు భారీగా పెరిగిందని.. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలిపింది.
Hyderabad: తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై జాతీయ నేర గణాంక సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో. తెలంగాణలో క్రైం రేటు భారీగా పెరిగిందని.. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలిపింది. ఇక సైబర్ నేరాల్లో అయితే తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని నివేదిక స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో 2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. ఇక 2021లో సైబర్నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52,430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా ఒక్క తెలంగాణలోనే 20 శాతం నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2020లో 12,985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి.
అటు లైంగిక అక్రమ రవాణా కేసులు కూడా తెలంగాణలోనే ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో లైంగిక అక్రమ రవాణా కేసులు 2083 నమోదు కాగా.. తెలంగాణలో అధికంగా 347 కేసులున్నాయి. అక్రమ రవాణా కేసుల్లో 1050 మంది నిందితుల అరెస్టుతో రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. కుటుంబ సమస్యలతో బలవన్మరణాల కేసుల్లో అత్యధికంగా ఒడిశాలో నమోదు కాగా.. తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. దేశంలో 2020తో పోల్చితే 2021లో బలవన్మరణాలు పెరిగాయి. 2021లో అధికంగా 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని తేలింది.
ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2021లో దేశవ్యాప్తంగా లక్షా 64 వేల 33 బలవన్మరణాలు జరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,429 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటక, ఏపీ రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 303 మంది రైతులు, 49 మంది కౌలు రైతులు, ఏడుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ రిపోర్ట్ స్పష్టం చేసింది.