Last Updated:

KTR : కేటీఆర్ సభలో అపశ్రుతి.. మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు

KTR : కేటీఆర్ సభలో అపశ్రుతి.. మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభలో ఇవాళ అపశ్రుతి చోటుచేసుకుంది. కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా కాన్వాయ్‌‌లో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమెకు కాలు విరిగింది. పార్టీ కార్యకర్తలు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు.

 

 

తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబాటు..
సీఎం రేవంత్ 14 నెలల పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబాటు చెందిందంటూ ఆరోపించారు. ఉచిత పథకాల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలకు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే కేటీఆర్ సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటించారు.

 

 

బండి సంజయ్‌కి ఏమి తెల్వదు..
కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదని కేటీఆర్‌ విమర్శించారు. అయోధ్య తలంబ్రాల పేరుతో రేషన్‌ బియ్యం పంచి మొన్న ఎన్నికల్లో గెలిచారని ఎద్దేవా చేశారు. మొన్న సెంటిమెంట్‌తో మాయ చేశారని ఆరోపించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ తెలంగాణకు ఏమి చేశాడని ప్రశ్నించారు. ఆయనకు ఏ తెల్వదని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒక్కటే తెలుసు అన్నారు. మసీదు కూలగొడుదాం.. అండ్ల శవం దొరికితే మీది, శివం దొరికితే మాది అంటాడని ఆరోపించారు. వాళ్లు ఓ బడి తెచ్చింది లేదు.. ఓ గుడి కట్టింది లేదని విమర్శించారు.

 

 

ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలని కోరారు. మంచి పాలకులను ఎన్నుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టడానికి కాంగ్రెస్‌ అసూయ, ద్వేషం, ఆశ మూడు ప్రయోగాలు చేసిందన్నారు. స్థానిక నాయకత్వంపై అసూయ నింపారన్నారు. కేసీఆర్‌ పై ధ్వేషం పెంచారని, ఓటర్లకు తులం బంగారం, రూ.15 వేల రైతుబంధు, పింఛన్ల పెంపు అని ఆశ పెట్టి మోసం చేశారని ఆరోపించారు.

 

 

తెలంగాణను కాపాడుకోవాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలన్నారు. ఏప్రిల్‌ 27 తర్వాత కొత్తగా సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని పిలుపునిచ్చారు. కమిటీలను నిర్మించుకుందామని చెప్పారు. కమిటీల్లో ప్రజల మధ్య ఉండే నాయకులకు చోటు కల్పిద్దామన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌, బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేలా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు పెట్టుకుందామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలన్నారు. ఈ సారి కరీంనగర్‌లోని 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 2028లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దామని శపథం చేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: