Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు… నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Heavy Rains in Telangana: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి విస్తరించాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నందున పాత భవనాలు, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.