Raisina Dialogue: ఢిల్లీలో ‘రైసినా డైలాగ్’.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi To Inaugurate Raisina Dialogue: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ సదస్సు నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా, ఈ రైసినా డైలాగ్ సదస్సు ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా మారనుంది.
అయితే ఈ ఏడాది ఈ సదస్సును ‘కాలచక్ర ప్రజలు, శాంతి, భూగ్రహం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పదోసారి జరగనున్న ఈ సదస్సులో పాల్గొనే ప్రము ఖుల జాబితాలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్, అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా తదితరులు ఉన్నారు. ఈ సదస్సులో న్యూజిలాండ్ ప్రధాని కీలకోపన్యాసం చేయనున్నారు. రష్యా- ఉక్రె యిన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ తరుణంలో భారత్‌కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, భారత్-తైవాన్ సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం అవుతున్నాయి. ఈక్రమంలో తైవాన్‌కు చెందిన ఓ సీనియర్ భద్రతా అధికారి సారథ్యంలోని టీమ్ కూడా ‘రైసినా డైలాగ్’ సదస్సుకు విచ్చేయనుంది. 125 దేశాలకు చెందిన మంత్రులు, మాజీ ప్రభుత్వాధి నేతలు, మిలిటరీ కమాండర్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు సహా దాదాపు 3,500 మందికిపైగా ఇందులో పాల్గొని కీలక అంశాలను చర్చించనున్నారు.
దాదాపు 20 దేశాల విదేశాంగ మంత్రులు ‘రైసినా డైలాగ్’లో పాల్గొంటారని సమాచారం. స్లొవేనియా, లగ్జంబర్గ్, లీచ్ టెన్ స్టీన్, లాత్వియా, మాల్డోవా, జార్జియా, స్వీడన్, స్లోవక్ రిపబ్లిక్, భూటాన్, మాల్దీవ్స్, నార్వే, థాయ్లాండ్, ఆంటిగ్వా, బార్బుడా, పెరూ, ఘనా, హంగరీ, మారిషస్ దేశాల విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరు కానున్నారు. క్యూబా డిప్యూటీ ప్రధానమంత్రి మార్టినెజ్ డియాజ్, ఫిలి ప్పీన్స్ విదేశాంగ శాఖ మంత్రి ఎన్రిక్ ఎ.మనాలో సైతం ఢిల్లీకి వస్తున్నారు.
‘రైసినా డైలాగ్’ సదస్సులో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ సమాజంలో రాజకీయ అవాంతరాలు, సవాళ్లపై చర్చించనున్నారు. ఈ మార్పులను ఎలా తట్టుకోవాలనే దానిపై చర్చ జరగనుంది. ఆర్థిక, వాణిజ్య, రాజకీయపర మైన వ్యవహారాల్లో ప్రతిష్ఠంభన తొలగాలంటే, ఎవరు? ఎక్కడ? ఎలా? అనే మూడు అంశాలపై ప్రపంచ దేశాలు స్పష్టతకు రావాలి. ఈ దిశగా చర్చలు జరగనున్నాయి.
అంతేకాకుండా, ప్రపంచ దేశాల నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు, వాటి ఉన్నతాధికారులు డిజిటల్ సమన్వయం చేసుకునేలా వ్యవస్థల ఏర్పాటుపై చర్చ జరగనుంది. ఉగ్ర వాదం కట్టడిపై చర్చించనున్నారు. దీనిపై కలిసికట్టుగా పనిచేసేందుకు సరైన వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. ప్రగతి పయనంలో కలిసికట్టుగా నడవాలనే భావనపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఇందుకోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ప్రపంచ శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఇందుకు దోహదపడే సంస్థలు, ప్ర తినిధులకు ప్రోత్సాహం, వారిని సమన్వయం చేయడంపై దృష్టి పెడతారు.