Last Updated:

Gaddar Awards 2025 : ఏప్రిల్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు

Gaddar Awards 2025 : ఏప్రిల్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు

Gaddar Awards 2025 : గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం, ఎంపికపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విధివిధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నంది అవార్డుల పేరిట చలనచిత్ర పురస్కారాలు ప్రదానం చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవ్వలేదని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాదికి సంబంధించిన ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ కోరిక మేరకు హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. సినిమా రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అవార్డులకు పంపాల్సిన ఎంట్రీల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వారం రోజుల్లో అన్ని ఎంట్రీలను తీసుకొని ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా పూర్తిచేస్తామన్నారు. ఏప్రిల్‌లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే ప్రముఖ నటుడు ఎం.ప్రభాకర్‌రెడ్డి పేరున ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగిస్తూ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మొదటిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏసీ గార్డ్స్‌లోని తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో ఈ నెల 13 నుంచి దరఖాస్తు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి: