AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లకు కొత్త యూనిఫామ్!

New Uniform Of AP Govt School Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్‌లు మారనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన డ్రెస్సుల కలర్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించనుంది.
ఇందులో భాగంగానే, కొత్త యూనిఫామ్‌లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా రూపొందించిన ఈ దుస్తులు చూడముచ్చటగా ఉన్నాయని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్‌లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
ఇదిలా ఉండగా, గతంలో ఒక్కో బెల్టును సగటున రూ.34.50 ఉండగా.. కొత్త టెండర్ల ప్రకారం ఒక్కో బెల్టు రూ.24.93కే అందించేలా మార్పులు చేశారు. నోటు పుస్తకాల ధర రూ.50 నుంచి రూ.35.64కి తగ్గించగా.. బ్యాగు ధర సగటున రూ.272.92 నుంచి రూ.250.. యూనిఫామ్ ఖర్చు రూ.1,081.98 నుంచి రూ.1061.43కి తగ్గించారు. ఈ మార్పులతో ఒక్కో విద్యార్థికి అందించే కిట్ రూ.1,858గా నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా యూనిఫామ్‌ను కుట్టించుకునేందుకు ప్రభుత్వమే సాయం చేయనుంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక్కో యూనిఫామ్‌ను కుట్టేందుకు రూ.120.. అలాగే 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల యూనిఫామ్ కోసం రూ.240 భరించనుంది. ఈ విధంగా విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.