Last Updated:

National Youth Day-2025: కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడిన ఆధ్యాత్మిక విప్లవకారుడు.. స్వామి వివేకానంద

National Youth Day-2025: కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడిన ఆధ్యాత్మిక విప్లవకారుడు.. స్వామి వివేకానంద

National Youth Day Swami Vivekananda Jayanti-2025: పరాయి పాలనలో మగ్గుతూ, తన స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయిన భరత జాతిని తట్టిలేపి, ఈ జాతికి తన ఘనమైన గతాన్ని, కోల్పోయిన వైభవాన్ని, సాగిపోవాల్సిన మార్గాలను గుర్తుచేసి చైతన్యవాణి. పశ్చిమదేశపు భౌతిక ఆవిష్కరణలను, భారతీయ సనాతన మూలాలను మేళవించి, ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడిన ఆధ్యాత్మిక విప్లవకారుడు. ప్రధానంగా.. 1.‘లేవండి.. మేల్కోండి, 2.గమ్యం చేరే వరకూ విశ్రమించకండి, 3.బలమే జీవితం..బలహీనతే మరణం. 4.ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలి, 5.విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకోండి. 6.మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులు. 7.మీ ప్రయత్నం చిన్నదే అయినా.. ధైర్యంగా దానిని కొనసాగిస్తే.. దాని ఫలితం గొప్పగా ఉంటుంది.’ అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపారు.’అంటూ తన చైతన్యపూరితమైన ప్రసంగాలతో నిరాశకు లోనై, నిద్రాణంగా పడి ఉన్న హైందవ జాతి ఆత్మను తట్టి లేపిన మార్గదర్శి… ఆయనే స్వామీ వివేకానంద. భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన గత శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో స్వామి వివేకానంద ముందువరుసలో నిలిచారు. ఆనాడు జాతికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి నేటికీ భరతజాతిని ఉత్సాహంగా ముందుకు సాగిపోయేందుకు అవసరమైన ఇంధనంగా పనిచేస్తూనే ఉంది. నేడు ఆ మహనీయుని జయంతి. దీనినే మనం జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటాం.

కోల్‌కతాలో 1863 జనవరి 12న ఒక సంపన్న కుటుంబంలో విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు ఆయన జన్మించారు. పెద్దలు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. బాల్యం నుంచే ఏకసంధాగ్రాహి. ఆటపాటల్లో ముందుండేవాడు. చెప్పలేనంత అల్లరి, ప్రతి దానినీ ప్రశ్నించి సమాధానపడితేనే దేనినైనా అంగీకరించే స్వభావం, అందరినీ తన మాటలతో ఆకట్టుకుని వారిని తన చుట్టూ తిరిగేలా చేయగల ఏదో ఆకర్షణ, అసాధారణ జ్ఞాపక శక్తి నరేంద్రుడిలో ఉండేవి. 1880లో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై.. తర్వాత తత్వశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం సత్యాన్వేషణలో భాగంగా ఆధ్యాత్మిక గురువును ఎంచుకునే పనిలో పడ్డారు. చాలామంది పండితులను కలిసినా ఆయనకు నిరాశే ఎదురైంది. అప్పుడే ఆయనకు దక్షిణేశ్వర్‌లోని రామకృష్ణ పరమహంస దర్శన భాగ్యం కలిగింది. తొలి రోజుల్లో కేవలం ఆయన ప్రసంగాలను ఆలకించటానికే వెళ్లేవాడు. ఈ క్రమంలో రామకృష్ణుల చూపు నరేంద్రుడిపై పడింది. ఒకరోజు.. ఎప్పటిలాగే ప్రసంగిస్తున్న రామకృష్ణులు.. నరేంద్రుడి వైపు చూసి, అనంతమైన ఆనందానికి, భావోద్వేగానికి గురికావటం, విచిత్రంగా అదే భావన వివేకానందుడిలోనూ కలిగింది. ఈ కాలక్రమంలో ఆయన రామకృష్ణుడి శిష్యుడిగా మారి, ఆయన చేతుల మీదగానే సన్యాస దీక్ష తీసుకుని స్వామీ వివేకానందగా మారారు.

సన్యాసం స్వీకరించిన తర్వాత స్వామి కేవలం తన ఆధ్యాత్మిక పురోగతి కోసం కాకుండా.. భౌతిక, భావదాస్యంలో మునిగిన తన జాతిని తట్టి లేపాలని సంకల్పించుకున్నారు. దేశవ్యాప్తంగా సంచరిస్తూ అగ్నిధారల వంటి తన ప్రసంగాలతో దేశంలో జాతీయ వాదాన్ని నింపటం ఆరంభించారు. ఈ క్రమంలో అనతికాలంలోనే దేశ జాతీయోద్యమానికి స్వామీజీ ప్రధాన రథసారథిగా అవతరించారు. పదునైన భాషతో కూడిన ఆయన ఉద్వేగ భరితమైన జాతీయ భావాలు దేశ విముక్తికై తపనపడుతున్న నాటి నేతలకు, యువతకు దారిదీపాలుగా నిలిచి, కదలించి, ప్రేరేపించాయి. ఆ రోజుల్లో జాతీయభావనతో విప్లవోద్యమంలో భాగస్వాములై, ఆత్మార్పణ చేసిన యోధులందరికీ స్వామీజీ ‘లెక్చర్స్ ‌ఫ్రమ్‌ ‌కొలంబో టు ఆల్మోరా’గ్రంథం మార్గదర్శిగా నిలిచింది. ప్రజలలో ఉంటూ, ఉద్యమాలు నడిపిన మరెందరో నేతలకూ స్వామీజీ చూపిన మార్గం ప్రేరణనిచ్చింది. వివేకానందుని పుస్తకాలు చదవటం వల్లే తనకు మాతృభూమి పట్ల ప్రేమాభిమానాలు వేయిరెట్లయిందని మహాత్మాగాంధీ ప్రకటించగా, యువత హిందూ దేశపు వైభవాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే.. వివేకానందుని జీవితాన్ని అధ్యయనం చేయాలని విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్లడించారు. భరత జాతి దాస్య విముక్తికి ఏ మార్గం సముచితమైనదో అర్థం కావాలంటే, వివేకానందుడి చెప్పిన మాటలు వింటే చాలని సుభాష్ చంద్రబోస్.. పేర్కొన్నారు. ‘స్వామీజీ ఇప్పుడు జీవించి ఉండుంటే.. నేను ఆయన పాదాల వద్ద సేవకుడిగా ఉండేవాడిని’అని ఆయన పేర్కొన్నారు. స్వామీజీ ఒక యుగపురుషుడని, ఆయనే లేకుంటే ఈ ప్రాచీన దేశం పరాయిపాలన నుంచి విముక్తమయ్యేది కాదని, సనాతన ధర్మమూ కనుమరుగై పోయేదని, ఈ జాతి ఎప్పటికీ స్వామీ వివేకానందకు రుణపడి ఉండాలని చక్రవర్తుల రాజగోపాలాచారి అభిప్రాయపడ్డారు. తమిళ జాతీయ మహాకవి.. స్వామీజీ గురించి మాట్లాడుతూ, భారతావనిలో హిందూధర్మ పునరుజ్జీవననానికి శుభారంభం చేసింది స్వామీ వివేకానందుల వారే అని అన్నారు.

స్వామీజీ సన్యాసం స్వీకరించిన తొలిరోజుల్లో దేశ సంచారం తర్వాత పరాయిపాలకుల మీద ప్రత్యక్షపోరాటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. దేశంలోని రాజ సంస్థానాల పాలకులందరూ కలిసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఊహించని రీతిలో బ్రిటిషర్ల మీద పోరాటం చేయాలని ఆదిలో స్వామీజీ సంకల్పించారు. దీనికోసం ఆయన అన్ని సంస్థానాల యువరాజులకు రహస్యంగా కబురుపెట్టి, ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అయితే వారి నుండి స్వామిజీ ఆశించిన రీతిలో స్పందన రాకపోవటంతో, ఆశ్చర్యం, ఆవేదనకు లోనైన స్వామీజీ క్షేత్రస్థాయి నుంచి జాతీయ భావాలు లేని ప్రజల మూలంగానే పాలకులలో ఆ నిరాశ ఆవరించిందని గుర్తించారు. ఆ పిదప ఆయన ప్రసంగాల తీరు మారిపోయింది. ఈ విషయాన్ని ఒక సందర్భంలో తన శిష్యులకు స్వామీజీ వెల్లడించగా, ఆ విశేషాలను ఆయన సోదరుడు భూపేంద్రనాథ్ దత్తా గ్రంధస్థం చేశారు. తన జీవిత లక్ష్యం గురించి తరచుగా స్వామీజీ చెప్పిన మాటలను, స్వామీజీ ప్రసంగాలకు ఆకర్షితురాలై, భారత్‌ వచ్చి ఇక్కడే జీవితాన్నిగడిపిన సిస్టర్ నివేదిత రాసిన ‘నేనెరిగిన మా గురువు’ అనే గ్రంథంలో ప్రస్తావించారు. ‘హిందూత్వాన్ని సమర శీలమైనదిగా చేయాలి. ఈ దేశాన్ని పూర్వవైభవస్థితికి తీసుకుపోవాలి. హిందూత్వపు ఉమ్మడి ఆధారాలను కనుగొని వాటిపట్ల శ్రద్ధ వహించటం ద్వారానే ఈ పనులన్నీ సాధ్యమౌతాయి.’అని స్వామీజీ చెప్పేవారు. అలాగే, ఈ దేశంలో పేద, దళిత, ఉపేక్షిత వర్గాలను చైతన్య పరిచి, వారిని ప్రధాన జీవన స్రవంతిలో భాగస్వాములను చేయటంతో బాటు, త్యాగం,సేవ అనేవి యుగాయుగాలుగా ఈ దేశపు ఆదర్శాలని ప్రజలకు పదేపదే గుర్తుచేయాలని స్వామీజీ చెప్పేవారని ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు. వ్యక్తి నిర్మాణం, శీల నిర్మాణం, క్రమశిక్షణ, జాతిని సంఘటితం చేయటం.. భరత జాతి తక్షణ అవసరాలుగా స్వామీజీ అభిప్రాయపడ్డారని తన పుస్తకంలో నివేదిక రాశారు. ‘హిందువునైనందుకు నేను గర్విస్తున్నాను. నాదేశ వాసులంతా ఈ భావనను అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవం, విశ్వాసం మీ రక్తాన్ని పొంగులెత్తించాలి. అది మీ జీవితాలకు జవసత్వాలు అందజేయాలి. అది ప్రపంచ విముక్తికై మీ చేత పని చేయించాలని నేను కొరుకొంటున్నాను’అనే తన గురువు వ్యాఖ్యలను నివేదిక తన పుస్తకంలో రాసుకున్నారు.

ఇదిలా ఉండగా, 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వ ధర్మ మహాసభకు సనాతన ధర్మ ప్రతినిధిగా హాజరై, మనదేశంపై పశ్చిమదేశాలకున్న అపోహలను పటాపంచలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భారతీయ యోగ, వేదాంత, పురాణేతిహాసాలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసి వారికి భరత జాతి ఔన్నత్యాన్ని, గత వైభవాన్ని ఎరుకపరిచారు. తన గురువైన రామకృష్ణ పరమహంస పేరుతో 1897 మే 1న రామకృష్ణ మిషన్‌ను స్థాపించి, గురుదేవుల ప్రసంగాలను, రచనలను ఆయా భాషల వారికి అందేలా చేశారు. దీంతో పాటు గొప్ప సామాజిక సేవకు కేంద్రాలుగా రామకృష్ణ మఠాలను తీర్చి దిద్దే యోజనను అందించారు. ప్రపంచమానవులంతా అన్నదమ్ములనే సౌభ్రాతృత్వ భావనకు ప్రాణంపోసిన ఆ మహోన్నత మానవతావాది .. తన నలభయ్యవ ఏట (1902 జూలై 4న) తన భౌతిక ప్రయాణానికి వీడ్కోలు పలికి, ఆ పరమాత్మలో లీనమైపోయారు. ఆ మహనీయుని 163వ జయంతి వేళ.. ఆయనకు నివాళులు అర్పిద్దాం. ఆ మహనీయుని అడుగుజాడలలో భరత జాతి నడవాలని, ఈ‘జాతీయ యువజన దినోత్సవం’సందర్భంగా అందరం కంకణబద్ధులమవుదాం.

ఇవి కూడా చదవండి: