India Pakistan War: భారత్- పాక్ కాల్పుల విరమణ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Markets Shows Huge profits amid India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అందుకు ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ దాడులు చేసింది. వీటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది. అయితే కొన్నిరోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.
తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. అలాగే అమెరికా- చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ లో ఒప్పందం కుదరటం, రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల వంటి అంశాలు కూడా మార్కెట్ సూచీలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే సెన్సెక్స్ 3 వేల పాయింట్లకు పైగా లాభాలు నమోదు చేసింది. ఇక మార్కెట్లు సూచీల జోరుతో మొత్తం కంపెనీల విలువ దాదాపు రూ. 16 లక్షల కోట్ల మేర పెరిగింది.
ఉదయం స్టాక్ మార్కెట్ల ప్రారంభంలో సెన్సెక్స్ 80,803 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 3 వేల పాయింట్లకు పైగా లాభంతో 82,495 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. చివరికి 2,975 పాయింట్ల లాభంతో 82,429 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 916 పాయింట్ల లాభంతో 24,924 వద్ద ముగిసింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ నిలకడగా ఉంది. కాగా స్టాక్ మార్కెట్ల లాభాంతో దాదాపు అన్ని కంపెనీలు లాభాలబాటలో పయనించాయి.