Waqf Bill : రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు : చర్చ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన చర్చ ప్రారంభించారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది సభ్యుల మద్దతు ఉంది.
లోక్‌సభలో బిల్లు ఆమోదం..
మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై అర్ధరాత్రి 12 వరకు చర్చ సాగింది. తర్వాత ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది వ్యతిరేకించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బిల్లకు ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది.
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ : సోనియా గాంధీ
వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ‘బుల్‌డోజ్’ చేశారని కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వివాదాస్పద పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం మధ్య లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు- 2024 ఆమోదం పొందిందన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. బిల్లును రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు. బిల్లుపై లోక్‌సభలో 12 గంటలపాటు చర్చించినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. బిల్లు దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించాలి..
ఇవాళ బిల్లు ఎగువ సభ ముందుకు రాబోతోందని, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ సభ్యులకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల సమన్వయంతో రాజ్యసభలో బిల్లును తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కేవలం కాగితానికి పరిమితం చేస్తూ మోదీ సర్కారు దేశాన్ని అగాధంలోకి నెడుతోందన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. దేశాన్ని తమ నిఘా నేత్రంగా మార్చుకోవాలని మోదీ సర్కారు ఉద్దేశాన్ని బహిర్గతం చేయాలని నేతలకు సూచించారు.