Road Accident In Uttar Pradesh: కుంభమేళాకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
![Road Accident In Uttar Pradesh: కుంభమేళాకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది మృతి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/kumbh.webp)
Road Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై బస్సు, బొలేరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మృతి చెందారు. మృతులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు వెళ్తుండగా జరిగిందని తెలుస్తోంది.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన కొంతమంది బొలెరోలో బయలుదేరారు. అయితే మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బొలేరో.. బస్సును ఢీకొట్టింది. ఈ బస్సులో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన భక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. దాదాపు 19మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.