Pawan Kalyan in Tamil Nadu: తమిళనాడులో జనసేనాని.. స్వామినాథుడిని దర్శించుకున్న పవన్ కల్యాణ్..!

Pawan Kalyan visits TamilNadu temples: దక్షిణ భారత తీర్థయాత్రలో ఉన్న జనసేనాని గురువారం తమిళనాడులోని స్వామిమలై, కుంభకోణం, తిరుచెందూరు క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్‌తో కలిసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న పవన్ అక్కడ పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఆలయాల అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శనాలు కల్పించారు.
రెండవరోజున..
గురువారం ఉదయం స్వామిమలై క్షేత్రంలోని స్వామినాథుడిని పవన్ దర్శించుకున్నారు. ఆలయానికి ప్రదక్షిణ చేసి ధ్వజస్థంభానికి మొక్కిన పిదప పవన్ ముఖమండపానికి చేరుకున్నారు. అనంతరం.. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్ సంప్రదాయబద్ధంగా పూజ చేసి, స్వామికి పంచ హారతులిచ్చారు. దర్శనానంతరం ఆలయంలోని మీనాక్షీ, సుందరేశ్వరులను కూడా పవన్ దర్శించుకున్నారు. పిదప, ఆలయ ప్రాంగణంలో స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన.. స్కంద షష్టి కవచ పారాయణంలో పవన్ పాల్గొన్నారు.
స్వామిమలై ప్రత్యేకత
సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రధానక్షేత్రాలలో స్వామిమలై నాలుగవది. తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలో ఈ క్షేత్రం ఉంది. స్వామిమలై అంటే దేవుని పర్వతం అని అర్థం. ఇక్కడే కార్తికేయుడు.. తన తండ్రి పరమేశ్వరుడిని శిష్యుడిగా స్వీకరించి, ఆయనకు ప్రణవమైన ఓంకారపు విశిష్టతను బోధించాడని ఐతిహ్యం. ఈ క్షేత్రంలోనే తన తపోశక్తిని కోల్పోయిన భృగు మహర్షి.. కుమార స్వామిని గురించి తపస్సు చేసి తిరిగి జ్ఞానాన్ని పొందాడనే పురాణ గాథ కూడా ఉంది. ఈ ఆలయ ధ్వజస్తంభం వద్ద గల వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. పూర్వం ఒక అంధుడు ఈ ఆలయంలోని రెండు పుష్కరిణులలో స్నానం చేసి.. ఈ వినాయకుడి మూర్తి వద్దకు వచ్చే సరికి అతనికి చూపు వచ్చిందని, అందుకే నాటినుంచి ఈ గణేశుడిని .. ‘నేత్రగర్ వినాయగన్’ అని పిలుస్తారు.
ఆదికుంభుని సేవలో..
తర్వాత పవన్ కుంభకోణంలోని ఆది కుంభేశ్వర స్వామిని, ఇక్కడి దేవేరి మంత్రపీఠేశ్వరి అమ్మవారిని సేవించుకున్నారు. 72 కోట్ల మంత్రాల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉండడం వల్ల ఇక్కడి అమ్మవారికి ఆ పేరు వచ్చింది. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం మేరకు పవన్ తొలుత ఆదివినాయగర్‌ని పూజిచారు. పిదప.. ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాండం ఆకారంలోని ఇక్కడి శివలింగ విశిష్టతను పవన్‌కి అర్చకులు వివరించారు. అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరు. అందుకే విశిష్ట పూజలు నిర్వహించారు. పంచ హారతులు ఇచ్చి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ధ్యానపీఠ దర్శనం
ఆది కుంభేశ్వరాలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనం తర్వాత ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ ధ్యానపీఠాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్లిపోతారని ప్రతీతి. ఇక్కడి పీఠం విశిష్టతను అర్చకులు పవన్‌కి వివరించారు. అంతకు ముందు అర్చకులు, అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు.
తిరుచెందూరులో..
అనంతరం అక్కడి నుంచి పవన్ బంగాళాఖాతం తీరంలోని తిరుచెందూరు కార్తికేయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ ఆర్. అరుమురుగన్ టక్కర్, ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ జ్ఞాన శైలరాన్ తోపాటు ఆలయ పండితులు జనసేనానికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. పూర్వం సముద్రంలో దాగిన సురపద్మన్ అనే రాక్షసుడి సంహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ తీరానికి వచ్చి రాక్షస సంహారం చేసి ఇక్కడ పెద్దగా విజయనాదం చేసినట్లు స్కాందపురాణం చెబుతోంది.
దేశక్షేమాన్నే కోరుకున్నా..
తిరుచెందూరు స్వామి వారి దర్శనం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ యాత్ర పూర్తిగా ఆధ్యాత్మికపరమైనది. రాజకీయాలకు దీనికి ఏ సంబంధం లేదు. హీరో శ్రీ విజయ్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడే ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ప్రజలకు దేశానికి మంచి జరగాలి అన్నదే నా అభిలాష. రాజకీయాలు ప్రజా క్షేమం కోసం ఉపయోగపడాలి. తమిళనాడు ప్రజలు పూర్తి సుఖసంతోషాలతో ఉండాలని నా ఆకాంక్ష. దేశ ప్రజలందరికీ తగిన ఆయురారోగ్యాలు అందించాలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని వేడుకున్నాను. దేశం బాగుండాలని కాంక్షించాను’అని పవన్ అన్నారు.
బీజేపీ నేతల స్వాగతం
కాగా, స్వామిమలై, కుంభకోణం సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ బృందానికి భారతీయ జనతా పార్టీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూల మాలలు, శాలువాలతో బీజేపీ నాయకులు సత్కరించారు. బాణసంచా పేల్చి సంబరాలు చేశారు.