Published On:

Iran Supreme Leader: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఎక్కడ? ఇరాన్‌ ప్రజల్లో మొదలైన ఆందోళన

Iran Supreme Leader: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఎక్కడ? ఇరాన్‌ ప్రజల్లో మొదలైన ఆందోళన

Iran supreme leader missing: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఎక్కడ??? ఈ నెల 13న ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై పెద్ద ఎత్తున బాంబులతో దాడులు చేసిన తర్వాత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం ఎక్కడ అధైర్య పడకుండా ఇజ్రాయెల్‌ అంతు చూస్తామంటూ రంకెలు వేశాడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఇరాన్‌ ప్రజల్లో లేని పోని అనుమానాలతో పాటు ఆందోళన మొదలైంది.

 

ఇజ్రాయెల్‌– ఇరాన్‌ యుద్ధం ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. బాంబుల మోత మోగడం లేదు. అంతా ప్రశాంతత నెలకొంది. అయితే కాల్పుల విరమణ తర్వాత అంటే సోమవారం నుంచి ఇరుదేశాల మధ్య ట్రంప్‌ బలవంతగానో లేదా బెదిరించో ఒప్పించి కాల్పుల విరమణకు అంగీకరింపజేశారు. అయితే ఇప్పటి వరకు ఇరాన్‌ సుప్రీంలీడర్‌ బహిరంగంగా ఎవ్వరికి దర్శనం ఇవ్వకపోవడంతో ఇరాన్‌ ప్రజల్లో లేని పోని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు ఒక వారం రోజుల నుంచి ఆయన ప్రజలకు దర్శనం ఇవ్వడం మానేశారు. దీంతో ఇరాన్‌ ప్రజల్లో పలు రకాల అనుమానాలతో పాటు ఆందోళన మొదలైంది. ఈ నెల 13 నుంచి ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై పెద్ద ఎత్తున బాంబుల మోగ మోగించింది. ఇరాన్‌కు చెందిన అణ్వాయుధాల ప్లాంట్‌లపై దాడులు చేసింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. యావత్‌ దేశం కష్ట కాలంలో ఖమేనీ వెంట నిలిచింది. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమెన్‌ నెతన్యాహు ప్రజలను చీల్చాలని ప్రయత్నించినా.. ప్రజలు మాత్రం ఖమేనీకే మద్దతు తెలిపారు. ఆయనకు అండగా ఉంటామని బల్ల గుద్ది మరి చెప్పారు.

 

ఇక ఇరాన్‌కు చెందిన 86 ఏళ్ల సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ… ఇరాన్‌లో ఆయన చెప్పిందే వేదం ఆయన మాటకు తిరుగులేదు. కాగా గత వారం రోజుల నుంచి ఆయన ఎవరికి కనిపించకుండా పోవడంతో దేశవ్యాప్తంగా పలురకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.. దీంతో పాటు పలు అనుమానాలు కూడా తోడవుతున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కలిసి సంయుక్తంగా ఇరాన్‌కు చెందిన కీలక న్యూక్లియర్‌ సైట్స్‌పై దాడులు చేశాయి. దీనికి బదులుగా ఇరాన్‌ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఒంటి చెత్తే ఇటు ఇజ్రాయెల్‌ అటు అమెరికాపై దాడులు చేసింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లకు టెలిఅవీవ్‌లో సుమారు 40వేల ఇళ్లు ధ్వంసం కావడంతో ప్రజలు నెతన్యాహను పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి పరిహారం ఇవ్వాలంటే బిలియన్‌ ల కొద్ది డాలర్లు కావాల్సిందే.. అదే సమయంలో సోమవారం నాడు ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై కూడా ఇరాన్‌ పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. దీంతో దోహా నగరం నిలువునా వణికిపోయింది. ట్రంప్‌ కూడా దాడులను లైట్‌ తీసుకున్నాడు.. ఇరాన్‌ నుంచి వచ్చిన క్షిపణులను గాల్లోనే పేల్చేశామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. కాగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మాత్రం ప్రపంచంలో ఏ మారు మూల ప్రాంతంలో అమెరికన్‌ పౌరుడు కనిపిస్తే.. వారిని చంపాలని పట్వా జారీ చేశాడు.

 

అయితే ఇరానియన్‌ మీడియా మాత్రం ఇజ్రాయెల్‌… ఇరాన్‌ మధ్య యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఖమేనీ ఇమేజ్‌లను కానీ.. వీడియోలను కానీ చూపించడం మానేశాయి. దీనికి అధికారులు చెప్పేది ఏమిటంటే ఆయనను అధికారులు రహస్య ప్రదేశానికి తరలించారని, అండర్‌ గ్రౌండ్‌ బంకర్లలో దాచమని ఎలక్ర్టినిక్‌ కమ్యూనికేషన్స్‌కు అందకుండా చూడాలనేది ఇరాన్‌ అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఆనవాళ్లు ఇటు ఇజ్రాయెల్‌కు కానీ.. లేదా అమెరికాకు లభిస్తే.. చంపేస్తారని ఇరాన్‌ భద్రతా దళాలకు చెందిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే న్యూయార్కు టైమ్స్‌ కథనం ప్రకారం చూస్తే.. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ట్రంప్‌ ఖమేనీని ఉద్దేశించి నువ్వు ఎక్కడ దాక్కున్నావో మాకు తెలుసు. నిన్ను చంపడం క్షణం పట్టదు. అయినా నిన్ను మాత్రం చంపమని భరోసా ఇచ్చాడు. అదే విధంగా నెతన్యాహును కూడా ఖమేనీ జోలికి పోవద్దని వారించాడు. అయినా నెతన్యాహు మాత్రం ఖమేనీ ఆనవాళ్లు లభిస్తే మాత్రం ఖచ్చితంగా లేపేసేవాడని టెహరాన్‌లో జోరుగా చర్చ జరిగింది.

 

ఇదిలా ఉండగా ఇరానియన్‌ ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ ఉన్నతాధికారులతో పాటు టాప్‌ లీడర్స్‌కు ఖమేనీతో సంబంధాలు లేకుండా పోయాయి. గత మంగళవారం నాడు ఇరానియన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ఫ్రైం టైమ్‌లో ఖమేనీ ఆఫీసులో సీనియర్‌ అధికారి మెహిదీ ఫజాలీని సుప్రీంలీడర్‌ ఎక్కడి అని ఆయనను టీవీ యాంకర్‌ అడిగారు. ఖమేనీ గురించి ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దయచేసి ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పండి టీవీ యాంకర్‌ మెహిదీ ఫజాలిని అడిగారు. ఇక్కడి నుంచి అసలు అనుమానాలు తలెత్తడం మొదలయ్యాయి. ఆయన టీవీ యాంకర్‌ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆయన గురించి మనం అంతా ప్రార్థనలు చెద్దాం. సుప్రీంలీడర్‌ను రక్షించేందుకు పంపించిన వారు తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. అంత తప్పించి ఆయన వివరాలు ఎక్కడున్నాడో చెప్పకపోయినా.. ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పి ఉంటే ప్రజల్లో నెలకొన్న అనుమానాలు దూరం అయ్యేవి.

 

ఇక టెహరాన్‌లో గత వారాంతంలో మహిళలు ఖమేనీ ఫోటోలతో పాటు ఫ్ల కార్డులను ప్రదర్శించారు. సాధారణంగా పార్టీకి చెందిన వారు పిలుపు ఇస్తేనే ఇలాంటి సీన్‌లు కనిపిస్తాయి. ఎవ్వరు ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినా… ఇరానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఖమేనీ పోస్టర్లతో ప్రదర్శనలు నిర్వహించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా ఇరాన్‌కు చెందిన అతి పెద్ద న్యూస్‌ పేపర్స్‌ కూడా గత వారం పది రోజుల నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాలం పాటు ఆయన ప్రజలతో టచ్‌లో లేకుండా పోవడం తమను ఆందోళనకు గురి చేస్తోందని ఖానేమన్‌ అనే డెయిలీ న్యూస్‌పేపర్‌ ఎడిటర్‌ మెహసిన్‌ ఖలీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేల ఖమేనీ కన్నుమూసి ఉంటే.. ఇరాన్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ముగ్గురు సభ్యుల మతగురువుల కమిటి రెండేళ్ల కిత్రమే ఖమేనీని తన వారసుడు ఎవరో గుర్తించి ఒక ప్రకటన చేయాలని సూచించారు. ప్రస్తుతం ఖమేనీ కూడా తన వారసుడి గురించి ఆలోచిస్తున్నట్లు న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్‌ వార్తా సంస్థకూడా తెలిపింది.

ఇక ఇరాన సుప్రీంలీడర్‌ విషయానికి వస్తే ఈ నెల 13 నుంచి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రహస్య ప్రదేశంలో బంకర్లలో ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన కుటుంబానికి ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌కు సంబంధంచిన ఒక యూనిట్‌ వాలీ ఏ అమీర్‌ అనే స్పెషల్‌ ఫోర్సెస్ 24 గంటల పాటు కంటికి రెప్పలా ఖమేనీని ఆయన కుటుంబానికి కాపాడుతున్నారని టాప్‌ సెక్యూరిటీ అధికారి రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలిపారు. ఇక ఈ నెల 13 తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. దీంతో ఇరాన్‌కు చెందిన టాప్‌ మిలిటరీ లీడర్‌షిప్‌తో పాటు పలువురు టాప్‌ న్యూక్లియర్‌ సైంటిస్లులు ప్రాణాలు కోల్పోయారు. మిడిల్‌ ఈస్ట్‌ చరిత్రలో ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితులు గతంలో లేవు. కాగా ఇజ్రాయెల్‌ నుంచి వస్తున్న మిస్సైల్స్‌ను ఇరాన్‌ అడ్డుకోవడమే కాకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను కూడా ధ్వంసం చేసింది. కాగా ఇరానియన్‌ అధికారుల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్‌ దాడుల్లో 627 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 5వేల మంది గాయపడ్డారని చెబుతున్నారు. అయితే ఇండిపెండెంట్‌గా ఎంత డ్యామేజీ జరిగిందో చూడ్డానికి ఫారిన్‌ మీడియాను అక్కడి అధికారులు అనుమతించడం లేదు. ఇక ఇజ్రాయెల్‌ తరపున 28 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రభుత్వం చెప్పింది.

 

ఇక మిడిల్‌ ఈస్ట్‌లో దీర్ఘకాలం పాటు అంటే 35 సంవత్సరాల పాటు ఖమేనీ ఉక్కుపాదంతో పాలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.. 2005లో ఒక సారి . అటు తర్వాత మాషా అమీనిని అక్కడి మోరల్‌ పోలీసులు హిజాబ్‌ సరిగా ధరించ లేదని అరెస్టు చేసి దారుణంగా చంపేసిన తర్వాత ఇరాన్‌ మొత్తం అగ్ని గుండం అయ్యింది. 1979లో ఇరాన్‌ షాను గద్దె దించిన నాటి రోజులు పునరావృతం అయ్యాయా అని అనిపించింది. ప్రభుత్వం కూలిపోతుందని భావించినా. ఖమేనీ మాత్రం మాషా అమీని ఉద్యమాని అణిచివేశాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో ప్రజలు ఖమేనీకి అండగా అయితే ఉన్నారు కానీ.. లోలోన ఖమేనీ అంటే ప్రజల్లో కూడా అసంతృప్తి లేకుండా పోలేదు. ఇస్లామిక్‌ మత చాందసవాదుల పాలనలో మహిళలకు స్వేచ్చ లేదు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగింది. ఈ నేపథ్యంలో ఖమేనీ దీర్ఘకాలం పాటు ప్రజలతో సంబంధాలు లేకుండా పోవడంతో ప్రజల్లో లేని పోని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల్లో ఉన్న ఇరానియన్‌లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సస్పెన్స్‌కు తెరదించాల్సింది మాత్రం అయతుల్లా ఖమేనీనే. ఆయన ఎంత త్వరగా దర్శనమిస్తే.. అంత మంచిది .. లేదంటే శత్రువులు అవకాశం కోసం కాచుకుకూర్చున్నారు. ప్రభుత్వం మారినా.. మారవచ్చు అని అంటున్నారు టెహరాన్‌ రాజకీయ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి: