TTD: రోబ్‌లాక్స్ కంపెనీపై టీటీడీకి కిరణ్ రాయల్ పిర్యాదు

TTD: తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్న రోబ్‌లాక్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్.. వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకునే దృశ్యాలతో రోబ్‌లాక్స్ యాప్‌ను రూపొందించినట్లు ఫిర్యాదులు అందాయని బీఆర్‌నాయుడు తెలిపారు. దైవ భక్తిని అదునుగా చేసుకుని ఆన్‌లైన్‌లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గేమ్‌ను డిజైన్ చేశారని కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుందో తెలిపేలా గేమ్‌ను డిజైన్ చేశారని.. వెంటనే దాన్ని తొలగించాలని టీటీడీను కోరినట్లు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ ఆలయాలపై చాలా గేమ్ డిజైన్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టిసారించాలని కోరారు.