Omar Abdullah : అతిథుల ప్రాణాలను కాపాడుకోవడంలో విఫలమయ్యా : జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

Jammu and Kashmir CM Omar Abdullah : పహల్గాంలో అతిథులను కాపాడుకోవటంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు. 26 మంది ప్రాణాలను అడ్డంపెట్టుకొని తాను రాష్ట్రానికి సంబంధించిన హోదాను డిమాండ్ చేయబోనని స్పష్టం చేశారు. జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు డిమాండ్ సరికాదని, మరో రోజు డిమాండ్‌ను లేవనెత్తుతానని చెప్పారు.
అసెంబ్లీ అత్యవసర సమావేశం..
ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. ఇలాంటి దాడులు గతంలో చాలా చూశామని, కానీ బైసరన్‌లో ఇంత పెద్దస్థాయిలో దాడి చేయడం 21 ఏళ్లలో ఇదే మొదటి సారి అన్నారు. మృతుల కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత తనదేనని చెప్పారు. తాను ఆ పని చేయలేకపోయానని, క్షమాపణలు చెప్పేందుకు తన వద్ద మాటలు కరవయ్యాయని తెలిపారు.
నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు..
పహల్గాం దాడి తర్వాత తాను ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేయాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. తన రాజకీయాలు అంత చౌకబారువి కాదని చెప్పారు. గతంలో రాష్ట్ర హోదా అడిగామని గుర్తుచేశారు. భవిష్యత్‌లో కూడా అడుగుతామన్నారు. కానీ, ఇప్పుడు 26 మంది అమాయకులు మృతిచెందారని, ఇలాంటి సమయంలో రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడగటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రజలు మద్దతు ఇవ్వాలి..
ప్రజలు తమకు మద్దతు ఇస్తే తీవ్రవాదం, ఉగ్రవాదం అంతమవుతాయని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇది అందుకు ఆరంభమని చెప్పారు. ఉద్యమానికి హాని కలిగించేది ఏదీ మాట్లాడకూడదు, చేయకూడదన్నారు. తాము మిలిటెన్సీని ఆయుధాలతో అదుపు చేయగలమన్నారు. దీనికి ప్రజల మద్దతు అవసరమని చెప్పారు. రాష్ట్ర సీఎంగా, పర్యాటక శాఖ మంత్రిగా తాను పర్యాటకులను కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈ నెల 22న జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో సేదతీరుతున్న 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. మరీ మతం అడిగి దారుణానికి పాల్పపడ్డారు. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు.