Last Updated:

Jamili Bill: జమిలికి జై కొట్టిన లోక్‌సభ.. జేపీసీ పరిశీలన తర్వాతే తదుపరి చర్యలు

Jamili Bill: జమిలికి జై కొట్టిన లోక్‌సభ.. జేపీసీ పరిశీలన తర్వాతే తదుపరి చర్యలు

Jamili Election Bill in Lok Sabha: అనుకున్న ప్రకారమే జమిలి బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ ప్రతిపాదిత రాజ్యాంగ (128 సవరణ) బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాతాల చట్టాల (సవరణ) బిల్లు-2024ను లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి ప్రతిపాదించారు. కాగా, దీనిని పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించగా, ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ద ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్‌ నిర్వహించారు.

విపక్షం నో చెప్పటంతో ఓటింగ్
కాగా, ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో సహా మెజారిటీ విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించటమనేది.. ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థపై దాడి అంటూ.. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేయగా, దేశంలో నియంతృత్యానికి బీజేపీ చేసే ప్రయత్నంలో భాగమే.. ఈ బిల్లు అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మండిపడ్డారు. ఎన్నికలను సంస్కరించేందుకు కాకుండా ఒక జెంటిల్‌మన్ కోరిక, కలను సాకారం చేసేందుకు ఈ బిల్లులను తెచ్చారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తప్పుపట్టారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే సంశయం ఏర్పడగా, స్పీకర్ దీనిపై ఓటింగ్‌కు అనుమతించారు.

అనుకూలంగా 269 ఓట్లు
అనంతరం ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. అయితే, 360 మంది ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. అనంతరం జరిగిన లెక్కింపులో 269మంది ఎంపీలు అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఓటేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ‘జమిలి బిల్లుల’ను కేంద్రమంత్రి సభలో ప్రవేశపెట్టారు. అనంతరం న్యాయశాఖా మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు కొత్త అంశమేమీ కాదని, గతంలో ఒకసారి ఇలానే ఎన్నికలు జరిగాయని, 1983 నుంచే ఈ డిమాండ్ ఉందని తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, రాష్ట్రాల హక్కులకు, సమాఖ్య స్ఫూర్తికి భంగం కాదని, స్వీడన్, జర్మనీతో సహా పలు దేశాల్లో ఈ విధానం ఉందన్నారు.

సొంతపార్టీ ఎంపీలపై బీజేపీ ఫైర్..
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన వేళ 20 మంది సొంతపార్టీ ఎంపీలు సభకు రాకపోవటంతో బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది. వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం తప్పనిసరిగా అందరూ సభలో ఉండాలని విప్ జారీ చేసినా సభ్యులు డుమ్మా కొట్టటమేంటని సీనియర్ నేతలు మండిపడ్డారు. కాగా, బిల్లు విషయంలో బీజేపీకి తగినంత బలం సభలో లేదనటానికి ఇదే రుజువంటూ కాంగ్రెస్ విమర్శలకు దిగింది.