National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు బిగ్ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీకోర్టు నోటీసులు

National Herald case : సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తాజాగా ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
నూతన చట్ట నిబంధనల ప్రకారం..
నూతన చట్ట నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని, కాబట్టి విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. గతవారం న్యాయస్థానం కేసును విచారించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేవని రాహుల్, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం చర్యలు తీసుకుంది.
ఈడీ ఛార్జిషీట్ దాఖలు..
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలో నిలిచిపోయింది. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.
2023 నవంబరులో ఈడీ జప్తు చేసిన ఓ కంపెనీకి చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ, ముంబయి, లఖ్‌నవూ భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు శామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.