Bhadradri Kothagudem : ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి

Bhadradri Kothagudem : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఉలిక్కిపడ్డ స్థానికులు..
ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భవనం కూలిన ఘటనలో మృతిచెందిన కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భవనం కూలిన అనంతరం ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాసరావు పరారులో ఉన్నట్లు సమాచారం.
విరుద్ధంగా భవన నిర్మాణం..
రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ భవనాన్ని కూల్చివేయాలని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను బేఖాతార్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంటి యజమాని సైతం సామాజిక కార్యకర్తలను అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పట్టణంలోని అనేక బిల్డింగ్ నిర్మాణాలు నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.