Pawan Thanks to Nitin Gadkari: ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్.. ఇదో గేమ్ ఛేంజర్ : పవన్ కల్యాణ్ ట్వీట్
AP Deputy CM Pawan Kalyan Thanks to Nitin Gadkari: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో దీన్ని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్‌కు పరిష్కారం లభించినట్లవుతుందని పేర్కొన్నారు.
టోల్ చెల్లింపులను సరళీకృతం చేస్తూ, ప్రయాణ ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రైవేట్ వాహన యజమానులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌లను అమలులోకి తీసుకువస్తుందుకు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రూ.3వేల వార్షిక పాస్‌తో వాహనదారులకు ఆర్థిక ఉపశమనం కలగడం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, వివాద రహిత హైవే ప్రయాణం సాకారం అవుతుందన్నారు. దీని ద్వారా టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. వారికి సమయంతో పాటు భారం తగ్గుతుందన్నారు. ఈ నిర్ణయం నితిన్ గడ్కరీకి ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రజాపాలన పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.
ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి..
ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌లను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. పోస్టును పవన్ రీట్వీట్ చేస్తూ పైవిధంగా స్పందించారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ వాహనాలకు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు నిబంధనలు ఉండే అవకాశం ఉంది.