Telangana: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం

High Court Reserves on KCR, Harish Rao’s Plea in Medigadda Case: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి నాసిరకమైన నిర్మాణంతోపాటు సరైన డిజైన్ లేకపోవడమే కారణమంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి భూపాలపల్లి లోయర్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లోయర్ కోర్టు కొట్టివేయడంతో జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆరుగురికి నోటీసులు జారీ..
రాజలింగమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్‌రావుతో కలిపి ఆరుగురికి నోటీసులను జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు పరిధి లేకున్నా పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే గత విచారణలో భాగంగా జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
ఇటీవల రాజలింగమూర్తి హత్య..
ఫిర్యాదుదారు రాజలింగమూర్తి గత వారం హత్యకు గురయ్యాడు. విచారణ సందర్భంగా ఈ విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందిన తర్వాత ఇక ఆ పిటిషన్‌ను ఎలా విచారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతి చెందినా పిటిషన్‌ను విచారించొచ్చని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. మేడిగడ్డ బ్యారేజీ వల్ల లక్షా 30వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పీపీ వాదించారు.
తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు…
ఇందులో ప్రజాప్రయోజనం ఉన్న దృష్ట్యా పిటిషన్‌ను విచారించొచ్చని పీపీ వాదించారు. గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జిల్లా కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోరారు. ఈ మేరకు హైకోర్టు తీర్పును చదివి వినిపించారు. రాజలింగమూర్తి ఫిర్యాదును భూపాలపల్లి లోయర్ కోర్టు కొట్టివేయగా ఫిర్యాదుదారు జిల్లా కోర్టును ఆశ్రయించారని పిటిషన్‌పై తీర్పును పున పరిశీలించాలని జిల్లా కోర్టు కింది కోర్టును ఆదేశించి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.