Sri Kaleshwara mukteswara Temple: కాళేశ్వరం ఆలయ గర్భగుడిలో అపచారం
Private Album Shooting in Sri Kaleshwara mukteswara Temple: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ఏకంగా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ప్రముఖశైవక్షేత్రం కాళేశ్వరం ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ఓ సాంగ్‌ను చిత్రీకరణ చేసినట్లు భక్తులు తెలిపారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ చేయడంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ షూటింగ్‌పై దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోలేదని ఆలయ పవిత్రతను దెబ్బతీశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. ఒకవైపు కుంబాభిషేకం, సరస్వతీ పుష్కరాలపై రాష్ట్ర మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా కాళేశ్వర ఆలయ విశిష్టతను తెలియజేయాలని చూస్తుండగా.. ఆలయ అధికారులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ కార్యనిర్వాహణ అధికారి మారుతిని వివరణ కోరగా గర్భగుడిలో షూటింగ్‌కు ఎటువంటి అనుమతి ఇవ్వలేన్నారు. కుంభాభిషేకం, పుష్కరాల ఆహ్వానం కోసం తాను ఆలయ సిబ్బందితో కలిసి శృంగేరి పీఠాధిపతులను ఆహ్వానించడానికి వెళ్లానని తెలిపారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని ఆయన వివరణ ఇచ్చారు.