Last Updated:

KT Rama Rao: రైతు చేతికి బేడీలా?.. రైతులు జైల్లో ఉంటే జైపూర్‌లో విందులా?

KT Rama Rao: రైతు చేతికి బేడీలా?.. రైతులు జైల్లో ఉంటే జైపూర్‌లో విందులా?

KTR Fires on CM revanth Over Lagacharla Farmer Incident: లగచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి, రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నందినగర్‌లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ ఈగోకు పోవటంతో గిరిజన రైతుల ప్రాణాల మీదకొచ్చిందన్నారు.

కుటుంబ సభ్యులకూ చెప్పరా..?
సంగరెడ్డి జైల్లో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా ఉంచడం దారుణమన్నారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో తీసుకెళ్లకుండా బేడీలతో తీసుకురావడం అమాననీయమని చెప్పారు. తీవ్రవాదులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధన ఉందని, రైతులకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బేడీల అంశాన్ని గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

రాహుల్ జోక్యం చేసుకోవాలి…
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని లగచర్ల కేసులు వాపస్ తీసుకునేలా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని కోరారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుతుంటే రేవంత్ జైపూర్ విందులు, వినోదాల్లో మునుగుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ ఇగో వల్లనే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. అదానీ, అల్లుడు కోసం పేదల భూములను రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అహంకారితో గిరిజన, దళిత రైతులు జైల్లో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హీర్యానాయక్, రాఘవేంద్ర, బసప్ప అనే రైతుల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు.