BJP Leade Eatala Rajender : హిందువులను అవమానపరుస్తున్న కాంగ్రెస్.. బాధ్యులపై కేసులు పెట్టి శిక్షించాల్సిందే
BJP Leader Eatala Rajender Serious about Muthyalamma Temple issue: ప్రజల ధార్మిక విశ్వాసాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలోనికి పోక తప్పదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని, నేటికీ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతోందని మండిపడ్డారు. బుధవారం కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు.
వారిపై చర్యలేవీ?
ముత్యాలమ్మ గుడిలో దారుణాలకు పాల్పడిని వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, నేటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఇకనైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిందితుల మీద చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు.
సర్కారు చిల్లర బుద్ధులు
అపవిత్రమైన ఆలయప్రాంతాన్ని శుద్ధి చేసేందుకు ఇక్కడి ప్రజలు అనేక రోజులుగా దీక్షలు, పూజలు చేశారని గుర్తుచేశారు. కొందరు వాటిని నిలువరించే ప్రయత్నం చేశారని ఈటల మండిపడ్డారు. దానికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ చేపట్టారని తెలిపారు. ర్యాలీపై అకారణంగా పోలీసులు దాడి చేసి భక్తుల రక్తాన్ని కళ్లజూశారన్నారు. అనేక మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారని, కానీ, చివరికి ప్రభుత్వం దిగివచ్చి ఆలయాన్ని మళ్లీ పునః ప్రతిష్ట చేస్తామని చెప్పిందన్నారు. ఈ ప్రాంత భక్తులు తమతమ విశ్వాసాలకు తగ్గట్టుగా బ్యానర్లు పెట్టుకుంటే, ప్రభుత్వంలో ఉన్నవారు ఆదేశాలిచ్చి మున్సిపల్ అధికారులతో బ్యానర్లు చింపేయించటమేంటని ఈటల నిలదీశారు.
ఇంటిలిజెన్స్ ఏం చేస్తోంది?
విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ ప్రాంతంలో పలువురు నేతలు ఫెక్సీలు పెట్టుకున్నారని, దీనిపై రగడ జరిగిందని, కాంగ్రెస్ వారు….. బీజేపీ కార్యకర్తలు పెట్టిన ఫెక్సీలు చింపారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత గొడవ జరుగుతుంటే ఇంటిలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. బాధ్యులపై తక్షణమే కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఘనంగా ప్రతిష్ట
కాగా, కుమ్మరి గూడలోని శ్రీముత్యాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో సికింద్రాబాద్ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక శాసన సభ్యుడి విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందజేసే విధంగా వేద పండితులతో పునఃప్రతిష్ఠ చేసుకొని దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.