Published On:

MLA Gopinath: ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత.. పలువురి సంతాపం

MLA Gopinath: ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత.. పలువురి సంతాపం

Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే టీడీపీ మాగంటితో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు విచారం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుండెపోటు కారణంగా నాలుగు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరారనే విషయం తెలిసిందన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నామని.. కానీ ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగం

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ, ప్రజల నేతగా పేరు తెచ్చుకున్న ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా.. మాగంటి కన్నుమూయడం చాలా దురదృష్టకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. శోకంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేటీఆర్ దిగ్భ్రాంతి

మాగంటి గోపినాథ్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

హరీశ్ రావు సంతాపం

మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గోపినాథ్ మరణవార్త తెలియగానే ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మరణం బీఆర్ఎస్ కు తీరని లోటని ఆవేదన చెందారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఎందరికో ఆదర్శమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

 

దానం నాగేందర్ తీవ్ర ఆవేదన

మాగంటి గోపినాథ్ మృతిపట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

కిషన్ రెడ్డి సంతాపం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచినేతగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. వారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బండి సంజయ్ సంతాపం

మాగంటి గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరని లోటు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.