Kaleshwaram Project: నేటి నుంచి కాళేశ్వరం విచారణ.. పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం
Kaleshwaram Commission Investigation Started From Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్లీ తన విచారణను కొనసాగించనుంది. పదిరోజుల పాటు సాగనున్న ఈ బహిరంగ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ 52 మందిని విచారించటంతో బాటు తదుపరి విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
రోజుకు 14 మందిని విచారణ..
ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో కమిషన్ రోజుకు 14మంది ఇరిగేషన్ ఇంజనీర్లను విచారించనుంది. ఈ క్రమంలో మొత్తం 52మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని నిర్ణయించింది. బ్యారేజీల సర్వే, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ, అందులో తలెత్తిన లోపాల వంటి పలు కీలక అంశాలలో ఇరిగేషన్ శాఖ తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై అప్పట్లో కీలకపాత్ర పోషించి, తర్వాత రిటైరైన ఐఏఎస్‌లనూ విచారణ చేయనుంది. దీనికోసం వారం రోజుల్లో విచారణకు రావాలని వారికి సమాచారమిచ్చేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేసింది. వీరిలో ఎస్కే జోషి, రజత్‌కుమార్, సోమేశ్‌కుమార్, వికాస్‌రాజ్, స్మితాసభర్వాల్ తదితరులున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం నుంచి కమిషన్‌కు అందిన కీలక పత్రాలు, నాటి విజిలెన్స్ నివేదికలనూ కమిషన్ కూలంకషంగా పరిశీలించనుంది.
హరీశ్‌రావుకూ పిలుపు?
ఈ విచారణలో భాగంగా ఈసారి కమిషన్ నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావును విచారణకు పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా హరీశ్ రావును పిలిచి విచారించిన తర్వాత నాటి ముఖ్యమంత్రిగా ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌కూ నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. గత విచారణ సందర్భంగా పలువురు అధికారులు తమ నిర్ణయాలను కాదని, గత ప్రభుత్వ పెద్దలే కీలక నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ ముందు వాంగ్మూలాలు ఇచ్చిన నేపథ్యంలో వీరిద్దరినీ విచారించాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చినట్లు సమాచారం. గతంలో విద్యుత్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాని నేపథ్యంలో ఈసారి తమ నోటీసులకు స్పందించకపోతే ఏం చేయాలనే దానిపైనా కమిషన్ దృష్టి సారించింది.
సబ్ కాంట్రాక్టర్లపైనా నజర్..
కాళేశ్వరం ప్రధాన బ్యారేజీల నిర్మాణాల్లో పనులు చేపట్టిన పలువురు కీలక ఉప గుత్తేదారులపై కమిషన్ దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా కమిషన్ వారిని విచారించనుంది. అలాగే, ఈ ప్రాజెక్టులోని అవకతవకలపై పలు వేదికల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొందరు ప్రైవేటు వ్యక్తులకూ వారి అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో విచారణకు హాజరై కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేసిన జలవనరుల సంస్థ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్, విద్యుత్ సంస్థల ఇంజినీరు రఘును మరోసారి కమిషన్ పిలిచే ఛాన్స్ ఉందని, చివరగా అకౌంట్స్ విభాగపు కీలక అధికారులను విచారిస్తారని తెలుస్తోంది.
ఆ నిర్ణయాలు ఎవరివి?
గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మార్చి, కాళేశ్వరంగా మార్చటంలో కీలక నిర్ణయాలు తీసుకున్నదెవరు? నాటి ఇంజనీర్ల మాటను కాదని నిర్మించిన బ్యారేజీలకు జరిగిన నష్టానికి బాధ్యులెవరు? అనే కోణంలోనూ కమిషన్ విచారణ చేపట్టనుంది. ఈ దఫా బహిరంగ విచారణలో తాజా మాజీ ఐఏఎస్‌లను క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాతే నాటి ప్రభుత్వం కీలక వ్యక్తులకు సమన్లు పంపాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.