Tirupati Devotes : వెంకన్న దర్శనం కోసం కి.మీ మేర బారులు తీరిన భక్తులు…
పవిత్ర పెరటాశి మాసం పురస్కరించుకొని తితిదే భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీ మేర క్యూలైన్లలో వేచివున్నారు
Tirumala: పవిత్ర పెరటాశి మాసం పురస్కరించుకొని తితిదే భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీ మేర క్యూలైన్లలో వేచివున్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో తితిదే క్యూ కాంప్లెక్సులు, ఉద్యానవనాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు యాత్రికుల సముదాయంలో విశ్రాంతి తీసుకునేందుకు టీటీడీ సదుపాయం కల్పించింది.
సమాచారం మేరకు, ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొండపైకి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. తమిళ భక్తులు పవిత్రంగా భావించే పెరటాశి మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు భక్తులు క్యూకట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. గోగర్భం డ్యాం దగ్గర క్యూలైన్లను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. నిన్నటిదినం సాయంత్రానికి శ్రీవారి ఆలయం నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేరకు సర్వదర్శన భక్తులతో క్యూలైన్ వ్యాపించింది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు క్యూలైన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలితీవ్రత కూడా అధికమైన క్రమంలో చాలామంది తిరుమల నుంచి దర్శనం చేసుకోకుండానే తిరుగు ప్రయాణమవుతున్నారు. రద్దీ బాగా పెరుగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు క్యూలైన్‌ను మూసివేశారు.
తిరిగి నేటి ఉదయం 10 గంటల తర్వాత క్యూలైన్‌లోకి ప్రవేశించాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు. అప్పటివరకు తిరుమలలోని యాత్రికులు వసతి సముదాయాల్లో సేదదీరాలని భక్తులకు సూచించారు. తిరుమలలోని అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్, గదుల కేటాయింపు కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉన్నక్రమంలో టీటీడీ అధికారులు గోగర్భం డ్యాం వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెరటాశి మాసం సందర్భంగా గురువారం నుంచే భక్తులు భారీగా వస్తున్నారని, వరుసగా సెలవులు, పెరటాశి కావడంతో తిరుమల క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడుతోందన్నారు. క్యూలైన్లు సరిపోకపోవడంతో శనివారం ఉదయం తిరిగి దర్శనానికి రావాలని కోరామన్నారు. శుక్రవారం రాత్రి సమయానికి క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులందరికీ దర్శనం చేయిస్తామన్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులు ప్రణాళికతో తిరుమలకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు తిరుమలలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొన్నారు. రాంభగీచ సర్కిల్ నుంచి నందకం, వరాహస్వామి విశ్రాంతి భవనం వరకు శుక్రవారం రాత్రి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది వాహనాల సమస్యను పరిష్కరించేందకు నానా కష్టాలు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Tirumala Brahmostavalu: బ్రహ్మోత్సవాలకు 5.69 లక్షలు మంది భక్తులు- టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి