Congress High Command: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం.. ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా అడుగులు
Congress High Command changes Incharge of Telangana affairs: కొత్త సంవత్సరం వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేయనుంది. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులలో మార్పులు చేయడంతోపాటు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను మార్చే దిశగా అధిష్ఠానం కసరత్తు చేస్తోందని సమాచారం.
ఇటీవల బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఒక ఇన్‌ఛార్జ్‌ను ఒకే రాష్ట్రానికి పరిమితం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ సీఎంలు, సీనియర్ నేతలకు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతగా తీసుకోనున్నారు.
ఇందులో బాగంగానే తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను దీపా దాస్ మున్సీకి స్థాన చలనం కల్పించనునట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వాటికి ఒక రాష్ట్రానికే పరిమితం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణతో పాటు కేరళ రాష్ట్రానికి దీపా దాస్ మున్సీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాజీ సీఎంలు లేదా సీనియర్ నేతలు ఇన్‌ఛార్జ్‌గా ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారంలో ఉన్నందున తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను మార్చే దిశగా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. కొత్తగా పరిశీలనలో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఒకరికి అవకాశం ఉండనుందని సమాచారం.
మరో వైపు, విద్యార్థి దశ నుంచే యూత్ కాంగ్రెస్ ద్వారా పార్టీలోకి వచ్చిన వారికి కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న రుతురాజ్, వంశీచంద్ రెడ్డిలకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలకు గిరి రుతురాజ్, వంశీచంద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత మార్పులు, చేర్పులపై అధికార ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.