New Year 2025: దేశ, రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పిన ప్రధాని, సీఎంలు
New Year wishes for a prosperous 2025: నూతన సంవత్సరం సందర్బంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందరూ ట్వీట్ చేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి వచ్చిన సందర్బంగా దేశ ప్రజలను ఉద్ధేశిస్తూ ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. 2024లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇందులో 2024లో సమిష్టిగా కృషి చేయడంతో అనేక విజయాలు సాధించామన్నారు. అలాగే 2025లోనూ మరింత కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీంతో వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని మోదీ ట్వీట్ చేశారు.
దీంతో పాటు ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలకు సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియో ఒక ఏడాదికాలంలో సాధించిన పురోగతి, ఐక్యత, వికసిత్ భారత్ వైపు వేసిన అడుగులను గుర్తు చేస్తుందన్నారు.
అలాగే కొత్త ఏడాది మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘తెలుగు ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. 2025 సంవ్సతరం ఆనందకర, ఆరోగ్యకర జీవితం అందించాలని కోరుకుంటున్నాను.2024లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మీరు కోరుకున్న ఆశయాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అహర్నిశలు పనిచస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో అభివృద్ధి చేశాం. ప్రధానంగా పెన్షన్లు పెంచాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ధాన్యం సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గుంతలు లేకుండా రోడ్లు వేస్తున్నామని చెప్పారు. కొత్త పాలసీలతో పెట్టుబుడులు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మరో వైపు ప్రజాప్రతినిధులు సైతం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.