Last Updated:

Australia vs India: పట్టు బిగించిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఆసీస్

Australia vs India: పట్టు బిగించిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఆసీస్

Australia vs India match Australia in trouble after losing 3 wickets: ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడింది. భారత్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మెక్‌స్వినీ(0) డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన పాట్ కమిన్స్(2) సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అలాగే మార్నస్ లబుషేన్(3)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 522 పరుగులు అవసరం ఉంది.

అంతకుముందు, రెండో ఇన్సింగ్స్‌లో భారత్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(161), విరాట్ కోహ్లీ(100) సెంచరీలతో చెలరేగారు. విరాట్ కోహ్లీ.. 16 నెలల తర్వాత సెంచరీ చేయడం విశేషం. మొత్తం టెస్ట్ మ్యాచ్‌లలో విరాట్‌కిది 30వ సెంచరీ కాగా.. ఆస్ట్రేలియాలో 7వ సెంచరీ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(6) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇక, రాహుల్(77) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. పడిక్కల్(25), సుందర్(29), చివరిలో నితీశ్(38) పరుగులతో రాణించారు. భారత్ 487/6 స్కోరు వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లైయన్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్లార్క్, హేజిల్ వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీశారు.