Case on Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై సత్తెనపల్లిలో కేసు నమోదు..

Case Filed EX Minister Ambati Rambabu in Sattenapalle Palnadu Dist: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసు నమోదు చేశారు. తొలుత పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు కంటెపూడి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు అడ్డంగా ఉంచిన బారికేడ్లను తోసివేశారు. అంతేకాకుండా ప్రశ్నిస్తున్న పోలీసులను నెట్టివేశారు. ఈ నేపథ్యంలోనే అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే ఓ వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటనలో భాగంగా వైసీపీ కార్యకర్త రవితేజ వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించినందుకు గానూ అదుపులోకి తీసుకున్నారు. తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజను పోలీసులు అరెస్టు చేసి నకరికల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు రవితేజను విచారిస్తున్నారు. కాగా, సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, జగన్ రెంటపాళ్ల పర్యటనపై పల్నాడు ఎస్సీ స్పందించారు. పోలీసుల షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం జరగలేదని వెల్లడించారు. ఆంక్షలకు విరుద్ధంగా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ టూరులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని చెప్పారు. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఏకంగా పబ్లిక్ ప్రాపార్టీని సైతం ధ్వంసం చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.