Published On:

RRR Movie-Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల్లో కొత్త కేటగిరీ – ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో అరుదైన గౌరవం

RRR Movie-Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల్లో కొత్త కేటగిరీ – ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో అరుదైన గౌరవం

RRR gets honorary mention as The Academy announces new Stunt Design category: చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్‌ది మొదటి స్థానం. ప్రతి నటుడు తన జీవితంలో ఒక్కసారైన ఆస్కార్‌ అవార్డును గెలవాలనుకుంటారు. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే ఈ అకాడమి అవార్డుల్లో తాజాగా కొత్త కెటగిరి చేరనుంది. ఇకపై స్టంట్‌ డిజైన్‌ క్యాటరగిరిలోను ఆస్కార్‌ అవార్డును ఇవ్వనున్నట్టు స్వయంగా అకాడమీ ప్రకటించింది.

 

2027 నుంచి విడుదలైన సినిమాలకే..

2027 నుంచి విడుదలైన సినిమాలను ఎంపిక చేసి ఈ జాబితాలో అవార్డులు ఇవ్వనున్నారు. ఈ విషయంపై అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘సినిమా తొలినాళ్ల నుంచి స్టంట్ డిజైన్ అనేది చిత్ర నిర్మాణంలో అంతర్భాగంగా ఉంది’ అని అకాడమీ సీఈఓ బిల్ క్రామెర్,అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ ట్విట్‌లో పేర్కొన్నారు. ఈ సాంకేతికత, సృజనాత్మక కళాకారుల వినూత్న పనిని గౌరవించడం మాకు గర్వకారణమని, ముఖ్యమైన సందర్భాన్ని చేరుకోవడంలో వారి నిబద్ధత, అంకితభావానికి వారిని అభినందిస్తున్నామని అన్నారు.

 

100వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమలు

అయితే 100వ అకాడమీ అవార్డుల్లో ఈ జాబితాను అధికారికంగా చేర్చనున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అకాడమీ ఆస్కార్‌ కొత్త జాబితాను ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. అందులో ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie) పోస్టర్‌ని ఉపయోగించింది. ‘స్టంట్‌ డిజైన్‌ ఆస్కార్‌'(Stunt Design Oscar) అంటూ షేర్‌ పోస్టర్‌లో హాలీవుడ్‌ సినిమాల సరసన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర పోస్టర్‌ చేర్చడం విశేషం. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమాల్లోని స్టంట్‌ల ఇమేజ్‌లతో ఈ విషయాన్ని ప్రకటించింది అకాడమీ.

 

వందేళ్ల నిరీక్షణ ఫలించింది: రాజమౌళి

ఈ ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డుల ప్రకటనలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ భాగంగా కావడంతో, ప్రకటన కోసం చిత్ర పోస్టర్‌ని ఉపయోగించడంతో తెలుగు ఆడియన్స్‌, టాలీవుడ్‌ సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరమంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆస్కార్‌లో కొత్త కేటగిరీని చేర్చడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. “వందేళ్ల నిరీక్షణ ఫలించింది. 2027 నుంచి విడుదలయ్యే సినిమాలకు కొత్తగా స్టంట్‌ డిజైన్‌లోనూ అవార్డులు దక్కనున్నాయి. దీన్ని సాధ్యం చేసినందుకు అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు” అని రాసుకొచ్చారు.