Sekhar Master: ‘అదిదా సర్‌ప్రైజు’ సాంగ్ వివాదంపై శేఖర్ మాస్టర్ రియాక్షన్

Sekhar Master Reacts on Adida Surprisu Controversy: కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య తరచూ వివాదంలో నిలుస్తున్నారు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌లో ఒకరైన ఆయన ఇటీవల కాలంలో తన కొరియోగ్రఫితో చిక్కుల్లో పడుతున్నారు. స్టార్ హీరోలకు అదిరిపోయే ఐకానిక్ స్టెప్పులను కంపోజ్ చేసే ఆయన అమ్మాయిలతో మాత్రం దారుణమైన స్టెప్స్ వేయిస్తున్నారు. తన కంపోజింగ్‌లో బూతులు చూపిస్తున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.
శేఖర్ మాస్టర్ పై తీవ్ర విమర్శలు
దీనికి కారణం ఇటీవల రిలీజైన ‘అదిదా సర్‌ప్రైజు’ సాంగ్. హీరో నితిన్, శ్రీలీల హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్‌లోని ఈ స్పెషల్ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో కేతిక శర్మ నటించింది. అయితే ఈ పాట ఎంతగా సెన్సేషన్ అయ్యిందో.. కొరియోగ్రఫితో అంతగా విమర్శలు కూడా ఎదుర్కొంది. అదిదా సర్‌ప్రైజ్‌కు ఆయన కంపోజ్ చేసిన స్టెప్ అభ్యంతరకరంగా కనిపించింది. ప్రతి ఒక్కరు ఈ స్టెప్‌పై అభ్యంతర వ్యక్తం చేశారు. అంతేకాదు సెన్సార్ బోర్డు సైతం ఆ స్టెప్‌ను.. పాట నుంచి తీసేయాలని ఆదేశించింది. దీంతో సెన్సార్ కట్ లో ఆ స్టెప్ ని తీసేశారు.
కన్నీరు పెట్టుకున్న మాస్టర్
దీంతో శేఖర్ మాస్టర్‌పై మరి దిగిజారిపోయి కొరియోగ్రఫీ చేస్తున్నారంటూ ఆయనను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఈ పాట వివాదంపై ఆయనను ప్రశ్నించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కిరాక్ బాయ్స్, కిలాడీ లేడిస్ 2 షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ఆయనతో అదిదా సర్‌ప్రైజ్ పాట కాంట్రవర్సి గురించి ప్రస్తావించింది. ‘మీరు కొరయోగ్రఫీ చేసిన ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది’ అని శ్రీముఖి అనగా.. శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
అన్ని పాటలు ఒకేలా చేయలేం..
దీనికి ఆయన మాట్లాడుతూ.. ‘ఏ సాంగ్‌ను ఎలా చేయాలో అలాగే చేస్తాం. అన్ని పాటలు ఒకేలాగ చేయం. మాస్ సాంగ్ ఉంటే మాస్‌లా, డ్యుయేట్ సాంగ్ అయితే ఒకలా.. పాటను బట్టి కొరియోగ్రఫి కంపోజ్ చేస్తాం. మీరు రాసేయటానికి, చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుంది. అనడం చాలా తేలిక’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతూనే శేఖర్ మాస్టర్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంత కూడా ఎమోషనల్ అయ్యారు.