Coolie: ఎన్టీఆర్ వర్సెస్ రజినీ.. లాభం ఎవరికి.. నష్టం ఎవరికి.. ?

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ 67 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుర్ర హీరోలే ఏడాదికి ఒక్కో సినిమా అంటుంటే.. రజినీ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ రెండు, మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అది మాత్రమేనా కుర్ర డైరెక్టర్స్ తో జత కట్టి హిట్స్ అందుకుంటున్నాడు.
జైలర్ సినిమాతో రజినీ హావా మొదలయ్యింది. ఈ సినిమా తరువాత జోరు పెంచిన తలైవా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ, అంతగా ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం రజినీ నటిస్తున్న చిత్రాల్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కూలీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.
లోకేష్ సినిమా అంటే అటు తమిళ్ లోనే కాదు ఇటు తెలుగులో కూడా ఒక రేంజ్ హైప్ ఉంటుంది. అంతేనా.. ఈ సినిమా కోసం లోకేష్ స్టార్ హీరోలందరిని దింపేశాడు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, షౌబిన్ షాహిర్.. ఇలా స్టార్స్ అందరూ కూలీలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టేకలకు కూలీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఆగస్టు 14 న కూలీ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఆ డేట్ ను చూడగానే ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చనే మొదలయ్యింది.
ఆగస్టు 14 న కూలీతో పాటు వార్ 2 కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. సౌత్ ఇండస్ట్రీ పరంగా చూస్తే ఇది ఎన్టీఆర్ వర్సెస్ రజినీ అని చెప్పొచ్చు. దీంతో ఏ సినిమాకు లాభం.. ఏ సినిమాకు నష్టం అని చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వార్ 2. సూపర్ హిట్ అయిన వార్ కు సీక్వెల్ గా వస్తుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
వార్ 2 అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఇండస్ట్రీలో ఒక హైప్ క్రియేట్ అయ్యింది. బాలీవుడ్ లో హృతిక్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సౌత్ లో ఎన్టీఆర్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. కూలీకి బాలీవుడ్, టాలీవుడ్ లో కొద్దిగా థియేటర్స్ దొరకడం కష్టమే. ఇంకోపక్క కూలీ గురించి చెప్పాలంటే ఇది ఆషామాషీ సినిమానేమీ కాదు.
రజినీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. తమిళనాడులో స్కూల్స్ కి, ఆఫీస్ లకు సెలవులు కూడా ప్రకటిస్తారు. అలాంటి రజినీకి తోడు నాగార్జున, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్ లాంటి పరభాష హీరోలు కలిశారు అంటే.. ఇది ఇంకా హైప్ తీసుకొస్తుంది. తమిళ్ లో అయితే వార్ 2 కు బిజినెస్ అవుతుంది కానీ, కూలీని మించి కాదు అని చెప్పొచ్చు.
కేవలం ఇది మాత్రమే కాదు.. మ్యూజిక్ విషయంలో మాట్లాడుకోవాలన్నా.. రజినీ- అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ కాంబో. అది జైలర్ తోనే అర్దమయ్యిపోయింది. అందులోనూ లోకీ సినిమా.. ఈ ముగ్గురు కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. అనిరుధ్ మాస్ మ్యూజిక్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. వార్ 2 కు ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నాడు.
బాలీవుడ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. ప్రీతమ్ మ్యాజిక్ చేస్తాడు అని చెప్పడం లేదు కానీ.. సౌత్ ఆడియెన్స్ పల్స్ ఎలాంటిదో అనిరుధ్ కు మాత్రం బాగా తెలుసు అని చెప్పొచ్చు. మ్యూజిక్ వర్క్ అవుట్ అయినా కూడా కూలీపై మరింత హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. లోకేష్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ లో స్టార్స్ లుక్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. డ్రగ్స్, గోల్డ్, స్టైలిష్ లుక్స్ తో ఒక్కొక్కరు అదరగొట్టేసారు. ముఖ్యంగా రజినీ స్టైల్ వింటేజ్ ను గుర్తుచేస్తుంది. వార్ 2 కు లుక్స్ తో పనిలేదు. హృతిక్ – ఎన్టీఆర్ ఇద్దరు కలిసి స్టెప్ వేసినా అది మరింత హైప్ పెంచుతుంది. ఇంకోపక్క ట్రోలింగ్ తో కూడా హైప్ పెంచడానికి రెడీ గా ఉంటారు.
ఇలా ఈ రెండు సినిమాలు పోటాపోటీగా ఉన్నాయి. దేనికి నష్టం.. దేనికి లాభం అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్ని ఉన్నా.. సినిమాలో కథ ఉండాలి. కంటెంట్ ఉంటే.. ఇవన్నీ ఉన్నా లేకున్నా ప్రేక్షకుడు సినిమా చూస్తాడు. మరి ఆగస్టు 14 న వార్ ఎవరి సైడ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.