Published On:

AI Effect on Employment: ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం.. మానవాళికి ముప్పే..!

AI Effect on Employment: ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం.. మానవాళికి ముప్పే..!

AI Effect on Employment: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచమంతా జపం చేస్తున్న పదం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అనేక పారిశ్రామిక సంస్థల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫలితంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి.

 

ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగం అంటూ ఏదీ లేదు. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నామ స్మరణే. కృత్రిమ మేధతో ఇప్పటికే అనేక సంస్థల్లో ఉద్యోగాలు హుష్ కాకి అయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడే సంకేతాలు వినిపిస్తున్నాయి.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు శాపంగా మారుతోంది. కృత్రిమ మేధ ఫలితంగా రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయంటున్నారు నిపుణులు. దాదాపు 30 కోట్ల ఉద్యోగాలు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయన్నది ఒక అంచనా. ఒకటని కాదు…అనేక రంగాల్లో ఉద్యోగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎర్త్ పెడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కృత్రిమ మేధ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయే రంగాల్లో సాఫ్ట్‌వేర్ ప్రధానమైనదన్నది నిపుణుల మాట. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు పోయే ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో డేంజర్ తప్పదంటున్నారు నిపుణులు. వచ్చే నాలుగైదేళ్లలో కృత్రిమ మేధ నెగెటివ్ ఫలితాలు వెలుగు చూస్తాయంటున్నారు.

 

ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా ఫైనాన్సియల్ అనాలసిస్‌, డేటా అనాలసిస్‌, మెడికల్ డయాగ్నసిస్‌ రంగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ రంగానికి కూడా సమీప భవిష్యత్తులో ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

 

మార్కెటింగ్ రంగంలో పనిచేసే కాపీ రైటర్ల ఉద్యోగాలకు కూడా ప్రమాదం వచ్చి పడింది. పత్రికా ప్రకటనలు రాయడం, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం, కంటెంట్ రైటింగ్.. సహజంగా కాపీ రైటర్ల డ్యూటీగా ఉంటుంది. ఇప్పటికే ఈ పనులకు అనేక మార్కెటింగ్ సంస్థలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాయి. దీంతో అనేక చోట్ల కాపీ రైటర్లు ఉద్యోగాలు కోల్పోయారు.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం నుంచి న్యాయరంగం కూడా తప్పించుకోలేకపోతోంది. న్యాయరంగంలో లీగల్ అసిస్టెంట్స్ అంటూ కొంతమంది ఉంటారు. సహజంగా విదేశాల్లో కేసులకు సంబంధించిన విషయాల్లో నోట్స్ రాసి పెట్టడానికి, న్యాయ సలహాలు ఇవ్వడానికి లీగల్ అసిస్టెంట్స్‌ ను నియమించుకుంటారు అడ్వకేట్లు. అయితే కొన్నేళ్ల కిందట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లీగల్ అసిస్టెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ ట్రెండ్ మరికొంత కాలం ఇలాగే నడిచి చివరకు లీగల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపూర్ణంగా భర్తీ చేసే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు.

 

అలాగే ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక ఉద్యోగాలకు కూడా ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింతగా పురోగతి సాధిస్తే ఫైనాన్స్ రంగానికి చెందిన ఉద్యోగాలు హుష్ కాకి అయ్యే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంపై కూడా కృత్రిమ మేధ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

భద్రతా రంగంలోని ఉద్యోగాలకు కూడా కృత్రిమ మేథ సవాల్ విసురుతోంది.సమీప భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్ గా పనిచేసే అవకాశాలున్నాయి. ఈ మెయిల్ నివేదికలు, రోజువారీ పనులను కృత్రిమ మేథ సాంకేతికత తో చక్కపెట్టుకోవచ్చు. దీంతో వ్యక్తిగత సహాయకులు లేదా కార్యదర్శుల పాత్ర చాలా వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

 

వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతమే. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే అంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చివరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉద్యోగాలకు  ఎసరు పెడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి: