Kamal Haasan: కమల్ క్షమాపణలు చెప్పాల్సిందే.. లేకుంటే ‘థగ్ లైఫ్’ని అడ్డుకుంటాం: కేఎఫ్సీసీ

KFCC Fires on Kamal Haasan Over His Comments on Kannda: కన్నడ భాషపై ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను కమల్ వెనక్కి తీసుకోవాని, దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలని కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
కాగా ఇటీవల థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు వస్తుండటంతో అవి తాను ప్రేమతో చేసిన వ్యాఖ్యలని, ప్రేమకు క్షమాపణలు ఉండవని.. తాను సారీ చెప్పేదే లేదని స్పష్టం చేశారు. ఆయన తీరుపై తాజాగా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) స్పందించింది. ఆయన వ్యాఖ్యలను కేఎఫ్సీసీ సైతం తీవ్రంగా ఖండించింది. మే 30లోగా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయన సినిమా రిలీజ్‌ను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు కర్ణాటక ఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఎం నరసింహులు ఓ ప్రకటన చేశారు. “కమల్ సినిమాను నిషేధించాలని ఇతర సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై భాగస్వామ్యపక్షాలతో సమావేశమయ్యాం. ఈ చర్చల అనంతరం ఆయన తప్పు చేశారని అభిప్రాయానికి వచ్చాం. కమల్ క్షమాపణలు చెప్పాల్సిందే. ఈ విషయంలో ఆయనను స్వయం కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. అలాగే కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు కూడా ఈ వివాదంపై స్పందించారు. రేపటిలోగా కమల్ హాసన్ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే.. ఆయన సినిమాను ఇక్కడ విడుదల కానివ్వమని స్పష్టం చేశారు.
ఆయనపై ఎటువంటి సానుభూతి లేదని, క్షమాపణలు చెప్పకుంటే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో కమల్ హాసన్‌పై కేసులు నమోదయ్యాయి. థగ్ లైఫ్ మూవీ ఈవెంట్లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమల్ కన్నడిగుల మనోభవాలు దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, తమకు విష బీజాలు నాటారని ఆరోపించారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారి కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.