Venkateswara Swamy Vaibhavostavalu: ఎన్టీఆర్ స్టేడియంలో.. శ్రీనివాసునికి శాస్త్రోత్తకంగా సహస్ర కలశాభిషేకం
హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో నిన్నటిదినం నుండి ప్రారంభమైన వైభవోత్సవాలు శ్రీవారిని భక్తులకు మరింత దగ్గర చేశాయి.

Hyderabad: హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో నిన్నటిదినం నుండి ప్రారంభమైన వైభవోత్సవాలు శ్రీవారిని భక్తులకు మరింత దగ్గర చేశాయి. శనివారం వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా నేడు కలియుగ దైవం వెంకన్న స్వామి కన్నుల పండువుగా దర్శనమిచ్చారు. నిత్య సేవల్లో భాగంగా శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
తొలుత ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. భోగ శ్రీనివాసమూర్తి, విష్వక్సేనుడితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో నేటి నుండి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు