Last Updated:

Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. ఆ జిల్లాలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. ఆ జిల్లాలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Heavy Rains: వరుణుడు దక్షిణాది రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాడు. ప్రజలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు ప్రజలను వణికిస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు కదులుతూ తీవ్ర తుపానుగా మారింది. చెన్నైకి దక్షిణంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల రోడ్లు కూడా జలమయం అయ్యాయి. అల్పపీడనం వాయుగుండంగా కుండపోత వర్షాలు కురుస్తాయని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతవరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇటు తమిళనాడులోనూ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చెన్నైతో పాటు మొత్తం 10 జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​అలెర్ట్‌ జారీ చేసింది. మరో వారం రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

క‌ర్ణాట‌కలో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తాయిని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే బెంగ‌ళూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు కర్నాటక ప్రభుత్వం సెలవులు ప్రక‌టించింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుంగా వీలైనంత వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో కుంభవృష్టి ఖాయమన్న సంకేతాలిస్తోంది వాతావరణశాఖ.