Amethi-Raebareli: అమెథీ, రాయబరేలీలో పోటీకి ఆసక్తి చూపని రాహుల్, ప్రియాంక
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రెండు విడతల పోలింగ్ కూడా ముగిసింది. మూడో విడత పోలింగ్ మే 7న జరుగనుంది. మూడవ విడతలో మొత్తం 12 రాష్ర్టాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 94 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అయితే దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ మాత్రం గాంధీలకు కంచుకోట అయిన అమెథీ, రాయబరేలీ మీదే ఉన్నాయి.
Amethi-Raebareli: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రెండు విడతల పోలింగ్ కూడా ముగిసింది. మూడో విడత పోలింగ్ మే 7న జరుగనుంది. మూడవ విడతలో మొత్తం 12 రాష్ర్టాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 94 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అయితే దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ మాత్రం గాంధీలకు కంచుకోట అయిన అమెథీ, రాయబరేలీ మీదే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అన్నీ రాజకీయ పార్టీలు లోకసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించేశాయి. కేవలం ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాహుల్ కానీ.. ప్రియాంక కానీ అమెథీ, రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాల్లేవని చెబుతున్నారు. మరో వైపు డెడ్‌లైన్ ముగియడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.
రెండు రోజుల్లో నిర్ణయం..(Amethi-Raebareli)
అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేయకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రియాంకా మాత్రం ఇప్పటి వరకు ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. కేవలం ప్రియాంకా మాత్రమే కాకుండా రాహుల్ కూడా అమెథీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదన్న వార్తలు వస్తున్నాయి. కాగా అమెథీతో పాటు రాయబరేలీకి మే 20వ తేదీ ఐదవ విడత పోలింగ్ జరుగనుంది. అయితే నామినేషన్ చివరి తేదీ మాత్రం ఈ నెల 3వ తేదీ. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరిని నిలపాలనే అంశంపై రెండు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు.
2019లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమెథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే ఆయన వాయనాడ్ నుంచి మెరుగైన మెజారిటితో గెలిచారు. 2024 లోకసభ ఎన్నికల్లో కూడా ఆయన వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా వాయనాడ్ లోకసభ నియోకవర్గానికి ఈ నెల 26న పోలింగ్ ముగిసింది. ఇక రాయబరేలీ నియోజకవర్గం విషయానికి వస్తే రాహుల్ తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక సోనియాగాంధీ లోకసభ రేసు నుంచి తప్పుకొని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
గత నెల 29న కేంద్ర ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఆయనకు అప్పగించింది. అయితే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ మాత్రం పార్టీ అధిష్టానానికి రాహుల్, ప్రియాంకాలను ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీలో నిలబెట్టాలని కోరుతున్నారు. అయితే గాంధీ కుటుంబం మాత్రం పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకుంది. మొత్తం 80 లోకసభ సీట్లకు గాను 17 సీట్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మిగిలినవి సమాజ్‌వాది పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు పంచుకున్నాయి. లోకసభ చివరి విడత పోలింగ్ జూన్1న జరుగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.