Last Updated:

Niti Aayog : పీఎం మోడి నేతృత్వంలోని నీతి ఆయోగ్ కి డుమ్మా కొట్టిన సీఎంలు ఎవరంటే.. కారణాలు అవేనా?

Niti Aayog : పీఎం మోడి నేతృత్వంలోని నీతి ఆయోగ్ కి డుమ్మా కొట్టిన సీఎంలు ఎవరంటే.. కారణాలు అవేనా?

Niti Aayog : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్‌మెంట్‌, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ని సిద్దం చేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి చీఫ్‌గా ప్రధాని వ్యవహరిస్తారు. కేంద్రం ఇది కీలకమైన సమావేశం అని చెబుతున్నప్పటికీ..కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం హాజరు కాలేదు. మొత్తం 7గురు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి హాజరు కాని సీఎంలు ఎవరో తెలుసుకుందాం..

నీతి ఆయోగ్ (Niti Aayog) మీటింగ్ కు గైర్హాజరైనా సీఎంలు.. 

కేసీఆర్.. కేజ్రీవాల్‌తో శనివారం హైదరాబాద్‌లో సమావేశం కావాల్సి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి హాజరుకాలేదు.

అరవింద్ కేజ్రీవాల్.. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఢిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ.. నీతి ఆయోగ్ మీటింగ్ కి హాజరవడం లేదని ప్రధాని మోదీకి లేఖ రాశారు.

భగవంత్ మాన్.. పంజాబ్ రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దూరంగా ఉన్నారు.

మమతా బెనర్జీ.. నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరు కాకూడదని బెంగాల్ సీఎం ముందే నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శిని పంపాలని టీఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.

నితీష్ కుమార్..  ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల నితీష్ కుమార్ హాజరు కాలేకపోతున్నారని బిహార్ మంత్రులు వెల్లడించారు.

అశోక్ గెహ్లాట్.. అనారోగ్య కారణాలతో సీఎం గెహ్లాట్ సమావేశానికి హాజరు కావడం లేదని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఎం.కె స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. అందుకే ఆయన హాజరుకాలేదు.

పినరయి విజయన్.. కేరళ సీఎం విజయన్ గైర్హాజరు కావడానికి ఎటువంటి నిర్దిష్ట కారణాలను మాత్రం వెల్లడించలేదు.

సిద్ధరామయ్య.. కర్ణాటక రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ఉండటం వల్లే హాజరు కావడం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.