Last Updated:

CM Chandrababu: ఆర్థిక కష్టాలు ఉన్నా ధైర్యమే ముందడుగు.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu: ఆర్థిక కష్టాలు ఉన్నా ధైర్యమే ముందడుగు.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu interesting Comments: కలిసికట్టుగా పనిచేస్తే వికసిత్ భారత్- స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ మేరకు తెలుగు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా.. ఇంగ్లిష్ అనువాదక పుస్తకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీకి ఆర్థిక కష్టాలు ఉన్నా ధైర్యంగా ముందడుగు వేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.

ఇక, మా ఫ్యామిలీలో జోవియల్‌గా ఉండే వ్యక్తి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అని చంద్రబాబు అన్నారు. రిటైర్ మెంట్ లైఫ్‌ను హ్యాపీగా గడిపేస్తున్నారన్నారు. ఆయనను పలకరిస్తే.. చాలా సంతోషంగా ఉన్నానని నాతో చెప్పారన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచతత్వం, నాయకత్వంపై పుస్తకం రాశారని చంద్రబాబు అన్నారు. దగ్గుబాటి నా తోడల్లుడు అని, ఎన్టీఆర్ వద్ద ఇద్దరం కలిసి చాలా విషయాలు నేర్చుకున్నామని గుర్తు చేశారు. అయితే దగ్గుబాటి కూడా పుస్తకాలు రాస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదని చమత్కరించారు.ఆయన రచయిత కానటువంటి రచయిత అని కొనియాడారు. ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశారన్నారు. దగ్గుబాటి ఇప్పటికే నాలుగు పుస్తకాలు రాశారని, ఇప్పుడు ప్రపంచ చరిత్ర పేరుతో ఐదో పుస్తకం రాచించారన్నారు.

ఇక, నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పలు రంగాల్లో పురుషుల కంటే మహిళలే గొప్పగా రాణిస్తున్నారని వెల్లడించారు. పలు అధ్యయనాలు కూడా ఈ అంశాన్ని నిరూపించాయన్నారు. ఆర్థికమంత్రిగా ప్రధాని మోదీ సరైన వ్యక్తిని ఎంపిక చేశారని కొనియాడారు. ప్రజలంతా మెచ్చుకునే కేంద్రమంత్రిగా నిర్మల పేరు తెచ్చుకున్నారన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అనంతరం చంద్రబాబు, దగ్గుబాటిలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మా మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ కాలంతో పాటు ముందుకు సాగాలని దగ్గుబాటి అన్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషమన్నారు.