Last Updated:

Delimitation : కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర.. జనాభా ఆధారిత డీలిమిటేషన్‌పై తీవ్ర వ్యతిరేకత

Delimitation : కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర.. జనాభా ఆధారిత డీలిమిటేషన్‌పై తీవ్ర వ్యతిరేకత

Delimitation : డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సౌత్ రాష్ట్రాల మధ్య మరోసారి రచ్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని బీజేపీ పార్టీ వాదిస్తోంది. ఈ క్రమంలో బుధవారం తమిళనాడులో నిర్వహించిన అన్ని పార్టీ సమావేశం ఆసక్తిగా మారింది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, అందువల్ల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది.

డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకం కాదు..
డీలిమిటేషన్ ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని, కానీ దేశ సంక్షేమం కోసం 50 ఏళ్లలో కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు ఇది శిక్షగా మారకూడదని స్టాలిన్ అన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని, అది రాబోయే 30 ఏళ్ల వరకు ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. తీర్మానాన్ని ప్రధానికి పంపుతామని పేర్కొన్నారు. అధికార డీఎంకే నేతృత్వంలో జరిగిన సమావేశానికి 64 పార్టీలకు ఆహ్వానం పంపించారు. అందులో 56 పార్టీలు పాల్గొన్నాయి.

ఇతర రాష్ట్రాల్లో సీఎం పర్యటించాలి..
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలను సమన్వయం చేయడానికి సీఎం స్టాలిన్ ఇతర రాష్ట్రాలను సందర్శించాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కోరారు. సౌత్ స్టెట్స్ కమిటీ ఏర్పాటు నిర్ణయం వీసీకే అధినేత తిరుమావళవన్ స్వాగతించారు. మనితానేయ మక్కల్‌ కట్చి చీఫ్‌ ఎంహెచ్‌ జవహిరుల్లా మాట్లాడారు. మన రాష్ట్రం నుంచి ఎంపీల సంఖ్య తగ్గడం లేదని కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య పెరిగితే ఇబ్బందిగా మారుతుందన్నారు.

సౌత్‌ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం : విజయ్
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని టీవీకే అధినేత విజయ్ అన్నారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని బలిపశువులను చేయడం అన్యాయమన్నారు. సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గినా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సంఖ్య పెరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు.

తెలంగాణలోనూ వ్యతిరేకత..
డీలిమిటేషన్‌పై తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దీంతో ఉత్తరాది రాష్ట్రాలు భారీగా ప్రయోజనం పొందనున్నాయని సీఎం రేవంత్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ఓట్లతో పనిలేకుండా గెలువాలని బీజేపీ పార్టీ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది శిక్ష అని మండిపడ్డారు. ఈ అంశంపై ఇటీవల స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: