Global Warming: పెరుగుతున్న భూతాపం.. మానవాళికి శాపం
Scientists issue Global Warming on Climate: పెరుగుతున్న భూతాపం మానవాళికి శాపంగా మారుతోంది. భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతో దూరం లేదంటూ శాస్త్రవేత్తలు రెండేళ్ల నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది ప్రముఖ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతోందని గుర్తించారు. మానవుని దురాశ, నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే, ఈ పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదని వారు స్పష్టం చేశారు. శిలాజ ఇంధనంతో నడిచే అన్ని మౌలిక సదుపాయాలను కొనసాగిస్తే పారిశ్రామిక కాలం నుంచి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పెరిగిపోతుందని, ఇది చాలా ప్రమాదకరమని తేల్చారు. పారిశ్రామిక విప్లవం కంటే ముందున్న ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు మించి భూతాపాన్ని పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో యుద్ధప్రాతిపదికన సత్వర చర్యలు చేపట్టాలని, 2035 నాటికి ప్రపంచం తమ గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాల్లో 60శాతానికి తగ్గించుకుంటేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని నాటి అధ్యయనానికి నేతృత్వం వహించిన లీడ్స్ వర్సిటీ ప్రొఫెసర్ పియర్స్ ఫాస్టర్ వెల్లడించారు.
పర్యావరణానికి కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. కర్బన ఉద్గారాలను అత్యధిక మొత్తంలో విడుదల చేస్తున్న 100 దేశాలను నాసా పరిశీలించింది. చైనా, అమెరికా ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచాయి. ఈ పాపంలో భారత్ పాత్ర కూడా తక్కువేం లేదు. కర్బనవాయువులను అత్యధిక మోతాదులో వెలువరిస్తున్న మూడో దేశం మనదే. టాప్ 10 దేశాలలో ఆ తర్వాతి స్థానాలు ఇండొనేసియా, మలేసియా, బ్రెజిల్, మెక్సికో, ఇరాన్, జపాన్, జర్మనీ దేశాలదే. ఇక బ్రిటన్, పశ్చిమ యూరప్, ఆస్ట్రేలియా, కజకిస్థాన్, ఉత్తర ఆఫ్రికా, చిలీ, థాయ్ లాండ్, ఫిలిప్పీన్స్ దేశాలు వాటి వెనుక నిలిచాయి. భూపరిశీలన ఉపగ్రహం ద్వారా ఏ దేశం ఎంతెంత గ్రీన్ హౌస్ వాయువులను వెలువరించిందన్న అంచనాలను నాసా రూపొందించగలిగింది. ఇందుకు ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ-2(OCO-2) శాటిలైట్ సేవలు ఉపయోగపడ్డాయి. దేశాలవారీగా వెలువడిన కర్బన ఉద్గారాలను ఆ ఉపగ్రహ సమాచారం ఆధారంగా లెక్కించారు. ప్రపంచంలో వంద దేశాల వల్లే వాతావరణం ప్రధానంగా మార్పులకు లోనవుతున్నట్టు నాసా పరిశోధన తేల్చింది.
పారిశ్రామిక విప్లవం దరిమిలా భూవాతావరణంలో వేడి గణనీయంగా పెరిగింది. వాతావరణం నుంచి భూఉపరితలానికి చేరే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ను కొన్ని వాయువులు గ్రహిస్తాయి. దానిని తిరిగి వాతావరణంలోకి అన్నివైపులా ప్రసరింపచేస్తాయి. దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. భూఉపరితలం వేడి 33 డిగ్రీల సెల్సియస్ ను మించి అధికం కావడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం లేకుంటే.. భూమి సగటు ఉష్ణోగ్రత మైనస్ 18 డిగ్రీల సెల్సియస్సే ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్స్, హాలో కార్బన్స్, మాలిక్యులర్ హైడ్రోజన్, నీటి ఆవిరి కారణంగా భూమి వేడెక్కుతోంది. అలాగే.. శిలాజ ఇంధనాల వాడకం మూలంగానూ భూవాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ పెద్దఎత్తున చేరుతోంది. కనీసం 29 దేశాల ఇంధన అవసరాల్లో 90% శాతం బొగ్గు, చమురు, గ్యాస్ తీరుస్తున్నాయి. చమురు నిల్వలు అధికంగా ఉండి.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతోంది. భారత్, సింగపూర్ తదితర దేశాల్లో గత పదేళ్లుగా ఈ పెరుగుదల రేటు కనిపిస్తోంది. అయితేఇప్పుడిప్పుడే దేశాలన్నీ సంప్రదాయేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతుండటంతో 1971 నాటితో పోలిస్తే.. ప్రస్తుతం శిలాజ ఇంధనాల వినియోగం గణనీయంగా తగ్గినా.. మనదేశంలో మాత్రం శిలాజ ఇంధనాల వాడకం 1990తో పోలిస్తే మూడింతలైంది.
బొగ్గు, చమురు, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు పెద్ద ఎత్తున భూవాతావరణంలోకి చేరుతున్నాయి. ఏటా 36 బిలియన్ టన్నుల మేర కర్బన వాయువులు విడుదలవుతున్నాయి. ఈ మొత్తంలో బొగ్గును మండించడం వల్ల 34%, చమురు వినియోగంతో 35%, గ్యాస్ ను మండించడం ద్వారా మరో 20% కర్బన ఉద్గారాలు గాలిలో చేరుతున్నాయి. మరి ఇంత ఈ కార్బన్ డై ఆక్సైడ్ మొత్తం ఎక్కడకు చేరుతోంది. వరల్డ్ ఓషన్ రివ్యూ అంచనా మేరకు అమెజాన్ వర్షారణ్యాలు 200 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటున్నాయి. సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ 950 బిలియన్ టన్నులు, ఆర్కిటిక్ ప్రాంతం మరో 1600 బిలియన్ టన్నుల కర్బన వాయువులను నిక్షిప్తం చేసుకున్నాయి. ఇక సముద్ర జలాల్లోకి 38 వేల గిగాటన్నులు చేరుతున్నట్టు అంచనా. మరోవైపు, ఎడాపెడా అడవులను నరికివేసిన దేశాల్లో భూతాపం అధికమవుతోంది. ఏటా ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తున్న కార్చిచ్చుల వల్ల కూడా అరణ్యాల విస్తీర్ణం తగ్గిపోవడం కూడా సమస్య మరింత జటిలమవుతోంది. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియేనియాలో అడవులు తగ్గిపోవడంతో కర్బన వాయువుల బెడద ఎక్కువైంది. ఇందుకు భిన్నంగా భూగోళంపై ఇతర ఖండాల్లో పచ్చదనం కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు తగ్గుముఖం పట్టాయి.
ఇక.. భారత్ విషయానికి వస్తే.. అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకూ ఎనిమిది దేశాల్లో.. 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన హిందుకుష్ హిమాలయాలు ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలకు ఆలవాలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మూడో ధ్రువంగా అభివర్ణిస్తారు. ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు హిమ రూపంలో ఇక్కడే ఉన్నాయి. దిగువ ప్రాంతాల్లోని కోట్ల మందికి ఇవి ప్రాణాధారం. ఇక్కడి హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు జలధారను అందిస్తున్నాయి. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా హిమానీనద మంచు నిక్షిప్తమై ఉంది. పర్యావరణపరంగా చాలా సున్నితమైన హిమాలయాలలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల మనదేశంలో ఏటికేడు అనేక విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొనటమే గాక జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అలాగే, పెరిగే సముద్ర మట్టాల కారణంగా సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న మనదేశంలోని పలు తీరప్రాంతాల్లోని ప్రదేశాలు రాబోయే వందేళ్లలో శాశ్వతంగా మునిగిపోయే ప్రమాదమూ పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధనవనరుల పాలసీని ప్రకటించి దేశాన్ని ఆ దిశగా నడిపించటమే గాక ప్రకృతి వనరుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చట్టాలను రూపొందిస్తోంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వాల ప్రయత్నాలకు.. పౌరసమాజం చొరవ కూడా తోడైతేనే అనుకున్న మార్పు సాధ్యమవుతుంది.