Telangana Assembly: అసెంబ్లీకి ఆటోలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. స్వయంగా ఆటో నడిపిన కేటీఆర్ డిమాండ్ ఇదే!
BRS MLAs Reached the Telangana Assembly by Autos: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆదర్శనగర్లో ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని స్వయంగా తానే నడుపుతూ ఆటో వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. అదే విధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. అలాగే ప్రశాంత్ రెడ్డి, పద్మారావుగౌడ్, కృష్ణారావు ఆటోలో వచ్చారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఖాకీ చొక్కాలు ధరించి మండలికి వచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 25కుపైగా ఆటోలో బయలుదేరారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు అండగా ఉండాలన్నారు. హామీలు అమలు చేయకపోవడంతో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటికి ప్రభుత్వమే కారణమవుతుందన్నారు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమి వెల్లడించారు. ఈ మేరకు ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగానే ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆటో కార్మికులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ర్యాలీగా బయలుదేరారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని చెప్పారు. లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, మంగళవారం అసెంబ్లీకి నల్లా చొక్కాలు ధరించి బీఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే నగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు.