Ambati Rambabu : తండ్రిని మించిన నారా లోకేష్.. మాజీ మంత్రి అంబటి హాట్ కామెంట్స్

Ambati Rambabu : మంత్రి నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడిని మించిపోయాడని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకేష్ అవకాశం వచ్చినప్పుడు స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కళ్లు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లోకేష్ నీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
2019లో పార్టీ ఓడిపోవడానికి మీరు కారణం అని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీకి 23 సీట్లు వస్తే మీరు ఓడిపోయారని దుయ్యబట్టారు. కూటమికి 164 సీట్లు వస్తే మీరు గెలిచారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు ఆడడంలో లోకేష్ తండ్రిని మించిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్ తెచ్చిన కంపెనీలను లోకేష్ తెచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ తెచ్చిన కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేస్తున్నాడని, దావోస్ వెళ్లి చంద్రబాబు, లోకేష్ ఎన్ని కంపెనీలు తెచ్చారు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు 52 రోజులపాటు జైలుకి వెళ్లిన ప్రిజనరి అని లోకేష్ గుర్తుపెట్టుకోవాలని సెటైర్లు వేశారు. మీ సహచర మంత్రివర్గ సభ్యులు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో ముందు తెలుసుకోవాలన్నారు. జగన్‌కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని లోకేష్ చెబుతున్నాడని, జగన్ మిర్చి యార్డుకు వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీని కల్పించలేదన్నారు. జగన్ ప్రజల్లోకి వస్తే మీ సెక్యూరిటీ ఆపలేదని, అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
మద్దతు ధరతో మిర్చి ఒక బస్తా ప్రభుత్వం కొనుగోలు చేస్తే తాను మీకు నమస్కారం చేస్తానని చెప్పారు. మద్యపాన ప్రియులు చంద్రబాబును బూతులు తిట్టుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు అందించే రూ.99 మద్యం తాగగానే అరగంటలో దిగిపోతుందట అని కామెంట్ చేశారు. మరోవైపు వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యాంగ విరుద్ధమైందని అందుకే తాము వ్యతిరేకించామని స్పష్టం చేశారు.